- అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం
- ఫేక్ కాల్స్ ఎత్తి సమాచారం ఇవ్వరాదు
- 1930కు ఫిర్యాదు చేయాలి
- ప్రజలను అప్రమత్తం చేసిన సిటీ సైబర్ క్రైమ్
డిజిటల్ అరెస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి మోసాలు హైదరాబాద్ లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం ఈ స్కాం కీలక లక్ష్యంగా పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కాల్స్ ద్వారా అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
బాధితులకు వీడియో కాల్ లేదా ఫోన్ ద్వారా అరెస్ట్ చేస్తున్నాం అని నటిస్తూ, ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని, వారెంట్లు జారీ అయ్యాయని నమ్మించి మోసం చేస్తారని హెచ్చరించారు. మోసగాళ్లు తమ కుట్రను బలపరచేందుకు నకిలీ వారెంట్లు, లేఖలు వంటి కట్టుకథల డాక్యుమెంట్లు తయారు చేసి పంపిస్తారు. అనుమానం లేకుండా ఉండేందుకు కుటుంబ ప్రతిష్టకు హాని కలుగుతుందని చెప్పి ఒత్తిడి పెంచుతారు. కేసు నుండి బయటపడాలంటే భారీ మొత్తం డబ్బు సేకరించి సుప్రీం కోర్టుకు డిపాజిట్ చేయాలి అని చెప్పి వెంటనే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. కుటుంబ సభ్యులకు చెప్పొద్దని హెచ్చరిస్తూ సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను వినియోగిస్తారని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇస్తోంది.. డిజిటల్ అరెస్ట్ అనే దాంట్లో ఏమీ లేదు. నిజమైన పోలీసులు ఎప్పుడూ ఫోన్, లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. కాలర్ స్పూఫ్ చేయబడవచ్చు కాబట్టి ఏ అధికారిక కాల్ వచ్చినా వెంటనే నమ్మేయకూడదు. పాన్, ఆధార్, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచకూడదు. అనుమానం వచ్చిన వెంటనే కాలు కట్ చేసి, కాలర్ ఇచ్చిన నంబర్లకు తిరిగి కాల్ చేయకుండా, స్థానిక పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ అధికారిక హెల్ప్న్ ద్వారా మాత్రమే ధృవీకరించాలి.
మెసేజ్లు, స్క్రీన్షాట్లు, కాల్ లాగ్స్ వంటి సాక్ష్యాలను భద్రపరచడం కూడా చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలు ఎదురైనపుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్న్ 1930కు కాల్ చేయాలని లేదా ఫిర్యాదు చేయాలని సూచించారు. తాజా అప్డేట్ల కోసం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ అధికారిక సోషల్ మీడియా పేజీలను, ఖాతాలను ఫాలో కావాలని చెప్పారు. డిజిటల్ ప్రపంచం వేగంగా మారుతున్న కొద్దీ మోసగాళ్ల పద్ధతులు కూడా అధునాతనంగా మారుతున్నాయి. ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ కూడా భారీ నష్టానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు.
