- అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్..
వనపర్తి పాత బస్టాండులో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు (నీరు, నీడ) కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలు పోరాటం చేస్తే పాత బస్టాండ్ కు పూర్వ వైభవం సంతరించుకున్నదని పేర్కొన్నారు. కానీ ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.

బస్టాండ్ ముందర డ్రైనేజీలో చెత్త పేరుకుని అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే పాత బస్టాండ్ పరిశుభ్రతతో పాటు సిసి రోడ్డు వెయ్యాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాల బస్సులు పాత బస్టాండ్ లోపలికి వెళ్లాలని, ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించి, పాత బస్టాండ్ లో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సతీష్, రామస్వామి, శివకుమార్, రాము, కొత్త గొల్ల శంకర్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
