Friday, February 13, 2026
Homeసాహిత్యంTelugu Literature | నిశ్శబ్ద విప్లవం.. ఇస్మాయిల్ కవిత్వం..

Telugu Literature | నిశ్శబ్ద విప్లవం.. ఇస్మాయిల్ కవిత్వం..

తెలుగు సాహిత్యంలో నిశ్శబ్ద విప్లవాన్ని (silent revolution) సృష్టించిన కవి (Poet) ఇస్మాయిల్(Ismael). ఆయనది అద్భుతమైన వ్యక్తిత్వం(Excellent personality). పూర్తి పేరు మహ్మద్ ఇస్మాయిల్. 1928 మే 26న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు. 2003 నవంబర్ 25న అనంత నిశ్శబ్దంలో లీనమయ్యారు. కాకినాడ పి.ఆర్.కళాశాలలో తత్వశాస్త్రం లెక్చరర్‌గా, తర్వాత ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించి 1988లో పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ అధికార భాషా సంఘంలో సభ్యుడిగానూ కొంతకాలం పనిచేశారు.

ఇస్మాయిల్ వందలాది కవితా సంపుటాలను రాయలేదు గానీ తన రచనల(Writings)తో తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. ఆయన కవిత్వం (Poetry) పదాల కోసం పదాలు పెట్టడం కాదు.. జీవితం, ప్రకృతి, మానవత్వం పట్ల లోతైన తాత్విక చింతన, సానుకూల దృక్పథం ప్రతిబింబించేలా ఉంటుంది. సాధారణ విషయాలను, చిన్న చిన్న దృశ్యాలను, దైనందిన జీవితంలోని అనుభవాలను అద్భుతమైన పద చిత్రాలుగా మలిచే శక్తి ఇస్మాయిల్‌కు మాత్రమే చెల్లింది.

- Advertisement -

ఆయన కవిత్వంలో ప్రత్యేకత ఏంటంటే.. అది నిశ్శబ్దంలోనూ విన్న వేదన, ఆనందం, కరుణ, సౌందర్యం. కవిత్వంలో వాదాలు, సుదీర్ఘ వాక్యాలు, క్లిష్టమైన పదజాలం ఉండవు. కేవలం ఒక చిన్న అనుభూతిని సున్నితమైన పద చిత్రాలుగా రేఖీకరించడం ద్వారా పాఠకుడి మనసుకు అందిస్తారు. ఆయన కవితలు చదివిన పాఠకుడు ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని తన కళ్లతో చూసినట్లు అనుభూతి చెందుతాడు. ఇస్మాయిల్ జపాన్ హైకూ కవిత్వాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసినవారిలో ప్రధానమైనవారు. ఈ పరిచయం ఆయన కవితల్లో చిన్నచిన్న చిత్రాలను సృష్టించ గలిగే సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది.

ఇస్మాయిల్ కవిత్వం ఒక విప్లవం. కానీ అది శబ్దాల విప్లవం కాదు. లోపల నిశ్శబ్దంగా కొనసాగే ఒక అనుభూతి విప్లవం. ఆయన కవితల్లో పదాల కన్నా వాటి వెనక ఉన్న భావం, చింతన, ప్రకృతి, జీవితం పట్ల తాత్విక దృక్పథం ముఖ్యం. ఆయన ‘చెట్టు నా ఆదర్శం’ అంటూ ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. ‘పిల్లలంత ఆనందంగా ఎందుకుంటారంటే వాళ్లు నిజమైన కవులు కాబట్టి. మనందరం పుట్టడం కవులుగానే పుడతాం’ అన్న ఇస్మాయిల్ మాటలు కవిత్వం పట్ల ఆయన వైఖరిని అద్భుతంగా వ్యక్తం చేశాయి.

ఇస్మాయిల్ ముఖ్య రచనలు.. మృత్యువృక్షం, చెట్టు నా ఆదర్శం, రాత్రి వచ్చిన రహస్య వాన, కప్పల నిశ్శబ్దం, చిలుకలు వాలిన చెట్టు, పల్లెలో మా పాత ఇల్లు. ఆయన విమర్శనా వ్యాసాలు.. కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం ప్రత్యేక గుర్తింపు పొందాయి. ‘మృత్యువృక్షం’కు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, ‘కవిత్వంలో నిశ్శబ్దం’కు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు లభించాయి. కళాసాగర్‌వారు ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఆయన పేరు మీద ‘ఇస్మాయిల్ అవార్డు’ ప్రదానం చేస్తూ తెలుగు కవిత్వంలోని అతిపెద్ద రత్నానికి గౌరవం చేకూరుస్తున్నారు.

ఇస్మాయిల్.. పదవులు, సన్మానాలకు దూరంగా ఉండేవారు. సాహిత్యాన్ని సామాజిక చైతన్యానికి పునాది చేయాలన్న ఆలోచనతో ప్రకృతి, మానవ సంబంధాలను లోతుగా దర్శించిన తాత్విక కవి. ఆయన కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు. అది జీవితాన్ని, మనుషుల అనుభూతులను, ప్రకృతిని ఒక కొత్త కోణంలో చూపించే అంతరాత్మ ఆవిష్కరణ. ఆయన నిశ్శబ్ద స్వరం తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రభావాన్ని సృష్టించింది.

(నవంబర్ 25న ఇస్మాయిల్ వర్ధంతి సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల
    సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్
- Advertisement -
RELATED ARTICLES

Latest News