కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకోవడంలో నంబర్ వన్
‘బంధుప్రీతి’.. డీఎంహెచ్ఓ కార్యాలయ స్పెషాలిటీ
అనర్హులకు అందలం, అర్హులకు అన్యాయం, అధికారుల ఇష్టారాజ్యం
రూల్స్ గీల్స్ జాన్‌తా నై.. మేం చెప్పిందే వేదం
జి.ఎన్.ఎం సెకండ్ ఇయర్.. పి.హెచ్.సిలో ఉద్యోగం?
ఒకరికేమో ఎం.ఎస్సీ అర్హత, ఇంకొకరికేమో జి.ఎన్.ఎం. అర్హత. కానీ.. ఉద్యోగం ఒక్కటే..
నల్గొండ ప్రతినిధి, నవంబర్ 23(ఆదాబ్ హైదరాబాద్): నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) కార్యాలయం అవినీతి(Corruption), అక్రమాలకు (Irregularities) కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసేవకి అంకితం కావాల్సిన ఈ శాఖలో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని, నిబంధనలను తుంగలో తొక్కి(Rules Break) కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారనే (Contract jobs for sale) ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.. కార్యాలయానికి వచ్చేది తక్కువ, కారులో తిరిగేది ఎక్కువ. జిల్లా అధికారి అంటే ప్రజలకు, ఉద్యోగులకు అందుబాటులో ఉండాలి. కానీ.. వివిధ సమస్యలపై ఫోన్ చేస్తే కనీసం స్పందించే తీరిక కూడా ఆయనకు ఉండటం లేదని, అధికారి తీరు చూస్తుంటే డీఎంహెచ్ఓ కార్యాలయం కన్నా ఆయన కారే ‘శాశ్వత కార్యాలయం’గా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనర్హులకు అందలం.. అర్హులకు అన్యాయం.. అధికారుల ఇష్టారాజ్యం..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని స్పష్టమవుతోంది. నిబంధనలను పక్కన పెట్టి తమకు అనుకూలమైనవారిని అందలం ఎక్కించడంలో వీరు సమర్థులని సమాచారం. అంతేకాకుండా అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ఈ శాఖ.. కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకోవడంలో జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని SNCU, NRC విభాగాల్లోని 4 స్టాఫ్ నర్స్ పోస్టుల నియామకంలో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు సదరు సెక్షన్ అధికారుల బృందం వసూలు చేశారనే ఆరోపణులు బలంగా వినిపిస్తున్నాయి.
బంధుప్రీతి.. డీఎంహెచ్ఓ కార్యాలయ స్పెషాలిటీ..
డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు బంధుప్రీతి అత్యంత మక్కువంట. కాంట్రాక్టు ఉద్యోగాలను తమ బంధువులకు కట్టబెట్టడంలో నిమగ్నమయ్యారని, ఎవరెవరికి ఉద్యోగాలు కట్టబెట్టారంటే గతంలో పనిచేసిన జిల్లా వైద్యాధికారి కోడలికి, మరదలికి, డీపీఓ భార్య, సెక్షన్ అధికారి కొడుక్కి, బావమరిదికి. ఇలా చెప్పుకుంటూపోతే బంధువులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నవారి జాబితా చాలా పెద్దదే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో నిబంధనలను తుంగలో తొక్కి ఒక అనర్హుణ్ని డీపీఓ పోస్టుకు నియమించారనే ఆరోపనలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నియామకంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.
రూల్స్ వీరికి పట్టవా?
నిబంధనలు తమకు పట్టవని, ఉన్న రూల్స్‌ను తుంగలో తొక్కుతారని, అవసరమైతే నూతన నిబంధనలు కూడా తయారు చేసి మరీ తమకు అనుకూలమైనవారిని అందలం ఎక్కిస్తున్నారనే విమర్శలు వైద్యారోగ్య శాఖ అధికారులపై వెల్లువెత్తుతున్నాయి. అర్హత ఉన్నవారిని పక్కన పెట్టి, అనర్హులకు పెద్దపీట వేయడం ఈ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య అని తెలుస్తోంది. అన్ని కరెక్టుగా చేస్తున్నామని చెప్పుకుంటూ పైఅధికారులను కూడా మభ్యపెడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుగుతుంది. అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి జిల్లా వైద్యారోగ్య శాఖలోని అవినీతి అధికారుల ఇష్టారాజ్యానికి తెరదించాలని ప్రజలు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు.
