ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామగ్రామాన సారెల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోంది. కోటి మంది మహిళలకు చీరెలు (Saries) పంపిణీ చేయనున్నారు. హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలోని ఏడు(కొహెడ, చిగురు మామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి భీమదేవరపల్లి, అక్కన్నపేట, హుస్నాబాద్) మండలాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆడపడుచులకు బొట్టు పెట్టి మరీ సారెను సోదరుడి లాగా అందిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి చీరలు బాగున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు(Gauravelli Project)కు సుప్రీంకోర్టులో ఉన్న కేసు అడ్డంకులు తొలిగాయని తెలిపారు. కాలువల కోసం భూసేకరణకు రైతులు మద్దతు తెలపాలని సూచించారు. త్వరలోని కాలువల తవ్వకాలు ప్రారంభించి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ఏమన్నారంటే..
హుస్నాబాద్ అమర వీరుల స్థూపం వద్ద శిల్పారామం (Shilparamam) మాదిరిగా 10 ఎకరాల్లో మహిళా శక్తి బజార్ (Mahila Shakti Bazar) ఏర్పాటుచేసి అన్ని రకాల వస్తువులు అమ్ముకోవచ్చు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రజా పాలనలో రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్ అందిస్తున్నాం. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, అగ్రికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్లలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.
హుస్నాబాద్‌లోని ఏడు మండలాలను ఏడు మెడికల్ కాలేజీలకు దత్తతిచ్చి మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ఎంఎన్జీ, బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా కాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తాం. కరీంనగర్ లయన్స్ క్లబ్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తాం. హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చాం. గ్రామగ్రామాన స్టీల్ బ్యాంక్‌లు ఏర్పాటుచేశాం. మహిళలు తమ పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇటీవల ప్రభుత్వం చేసిన ఇంటింటి సర్వేలో ఉన్నత చదువులు చదివిన కుటుంబాలే ఉన్నత స్థాయిలో ఉన్నాయని వెల్లడైంది. నియోజకవర్గంలో మొదటి దశలో మంజూరైన 3500 ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తవుతున్నాయి. త్వరలో మరో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తున్నాం. మండల సమైక్యలకు, గ్రామ సమైక్యలకు స్థలాలు సేకరించి భవనాల కోసం నిధులు కేటాయిస్తాం. ప్రతి మహిళకు ఒక సోదరుడు లాగా మీ అందరికీ అండగా ఉంటాం. భవిష్యత్‌లో మహిళలు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలి.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు హైమావతి, పమేలా సత్పతి, స్నేహ శబరీష్, అడిషనల్ కలెక్టర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
