HomeతెలంగాణMahesh Kumar Goud | కుంగిపోయే ప్రాజెక్టులు కట్టారు..

Mahesh Kumar Goud | కుంగిపోయే ప్రాజెక్టులు కట్టారు..

  • ఇప్పుడు ప్రభుత్వానికి గడువులా..?
  • ఈటల బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు..
  • తీవ్ర విమర్శలు చేసిన మహేష్ కుమార్ గౌడ్..

హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రతిపక్షాలపై విమర్శల జడివాన కురిపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కుంగిపోయే ప్రాజెక్టులు కట్టిన మీరు… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి గడువులు విధించడం హాస్యాస్పదమని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మార్క్ అభివృద్ధి చూసి ఆయనకు మిట్టమధ్యాహ్నమే చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. హరీశ్ రావు ఒకవేళ కాంగ్రెస్‌లోకి వస్తానంటే… తమ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో (పీఏసీ) చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్లు ఎలా జమ అయ్యాయో చెప్పాలని నిలదీశారు.

నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండి నీళ్ల దోపిడీని ప్రశ్నించని ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్… ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అందరికీ ఒకటేనని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. కడియం శ్రీహరి, కొండా సురేఖ వివాదాలపై సచిన్ సావంత్, జగ్గారెడ్డిలతో కూడిన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రతినిధులతో చర్చించి ఈ నెల 15న కొలిక్కి తెస్తామని కీలక అప్‌డేట్ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News