- పట్టపగలే వైన్స్ లో మద్యం సేవించి విధులకు హాజరు
- మత్తులో ఓ అధ్యాపకురాలి ఎస్ఆర్ లో తప్పుడు వివరాలు నమోదు..!
విద్యార్థులు సమాజంలో ఉన్నతులుగా ఎదిగేందుకు మాధ్యమిక దశ ఇంటర్మీడియట్. విద్యతో పాటుగా క్రమశిక్షణ విలువలను విద్యార్థులకు నేర్పించాల్సిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు,ఉద్యోగులు వారి భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టి వేస్తున్నారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధన అటకెక్కింది.విద్యార్థులకు బోధనకి బదులుగా దుర వ్యసనాలకు బానిసలు కావడం ఎలా అనే రీతిలో ఉద్యోగులు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తున్నారు. విద్యార్ధులకి ఆదర్శంగా,స్ఫూర్తి దాయకంగా నిలవాల్సిన ఉద్యోగులు కళాశాల విధులకు హాజరైనట్లుగా ఎఫ్ఆర్ఎస్ యాప్ లో, రిజిష్టర్ లో హాజరు వేసుకుని ఏకంగా పట్టపగలే మద్యం దుకాణంలో మద్యం సేవించి మత్తులో తేలియాడుతున్నారు.గత కొన్ని నెలలుగా ఈ తతంగం జరుగుతున్నా సరే ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్న తరుణంలో మత్తుకు మరింత బానిసలు అయ్యేలాగా ఉద్యోగులే నిత్యం మద్యం సేవించి విధులకు హాజరు కావడం గమనార్హం.
పట్టించుకోని ప్రధానాచార్యులు..!
ఉదయం కళాశాల విధులకు హాజరైనట్లుగా కొందరు ఉద్యోగులు హాజరు వేసుకుని మరుక్షణమే మద్యం దుకాణాలు,బెల్ట్ షాపుల్లో తిరుగుతూ మద్యం సేవిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మద్యం సేవించి కళాశాల విధులకు సైతం హాజరవుతున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఉద్యోగులలో ఒకరు ఓ అధ్యాపకురాలి సర్వీస్ రిజిష్టర్ (ఎస్ఆర్)లో తప్పుడు వివరాలు నమోదు చేశారు. అదే మత్తులో కళాశాల విద్యార్థులతో,తోటి మహిళ ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించి అరాచకాలకు పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారనేది మిలియన్ డాలర్లు ప్రశ్న.ఉద్యోగులు నిత్యం మద్యం సేవించి విధులకు వస్తారని తెలిసి కూడా కళాశాల ప్రధానాచార్యులు నోరు విప్పకపోవడం,వారి పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కనీసం ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం ప్రధానాచార్యుల బాధ్యతారాహిత్యాన్ని తెలియపరుస్తుంది.జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ చేపట్టి బాధ్యులు పై శాఖాపరమైన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
