Thursday, February 12, 2026
HomeతెలంగాణHarish Rao | మీ మోసాలకు అంతే లేదు..

Harish Rao | మీ మోసాలకు అంతే లేదు..

  • రైతుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్
  • ఇప్పటికే 1200 కోట్లు ఎంఎస్పీ బకాయిలు
  • ఈసారి కొన్న వడ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి
  • ఏ రోజు డబ్బులు ఆ రోజే వేస్తామని మోసం
  • రాష్ట్రం లో దయనీయంగా రైతుల పరిస్థితి
  • 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు ఏవీ?
  • ప్రభుత్వంపై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలన వల్ల రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని మాజీ మంత్రి, – సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రత్యక్షంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేస్తామని చెబుతూనే, అమల్లో మాత్రం కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేసి, 85 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని మండిపడ్డారు.

ఇంతకుమించి, ఇప్పటికే కొనుగోలు చేసిన వడ్లకు బిల్లులు క్లియర్ చేయకపోవడం వల్ల రైతులు రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. దాదాపు రూ.1200 కోట్ల ఎంఎస్పీ బకాయిలు, రూ.200 కోట్ల బోనస్ ఇంకా పెండింగ్లో ఉండగా, మాటల్లో 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా రైతుల చేతికి అందించలేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. పోయిన యాసంగి బోనస్ సహా అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులను తీవ్ర చలిలో రాత్రులు గడపకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిల్లర్లతో తక్షణం టై -అప్ చేయాలని, రైతులు అన్నదానితో పాటు మనుగడ కోసం కూడా పోరాడుతున్న ఈ సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం క్షమార్హం కాదని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

మక్క రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో పండిన మక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యాన్ని చవిచూసిందని అన్నారు. రైతులు నిండా అప్పులపాలు అవుతుండగా, ముఖ్యమంత్రి మాత్రం మక్కల కొనుగోలుపై కనీస శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగం అయ్యిందని, కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను దారుణంగా నష్టపరిచిందని పేర్కొన్నారు.

.కొన్ని జిల్లాల్లో 11-12 క్వింటాళ్ల పత్తి పండిన రైతులు మిగతా పత్తిని ఏం చేయాలన్నది కేంద్రం పట్టించుకోకపోవడం వల్ల పత్తి రైతులు ఇప్పటికీ ఆవేదనలో ఉన్నారని అన్నారు. ఒకవైపు జిన్నింగ్ మిల్లర్లు, మరోవైపు సిసిఐ సక్రమంగా పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. పత్తి రైతులను బీజేపీ, మక్క రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాల జాబితాకు అంతమే లేదని హరీశ్ రావు ఆరోపించారు.

రెండు పంటలకు రైతు బంధు నిలిపేయడం, బోనస్ లేకపోవడం, పంటల బీమా చేయకపోవడం, రుణమాఫీని సగానికి మాత్రమే పరిమితం చేయడం ఇవన్నీ వాగ్దానాలకే పరిమితమై రైతులకు మోయలేని భారంగా మారాయని చెప్పారు. పోయిన యాసంగిలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు, ఈ సంవత్సరం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. కనీసం పంట బీమా ఉంటే రైతులు ఊపిరి పీల్చుకునేవారని, వెంటనే రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News