అడవుల పరిరక్షణకు ఏ చర్యకైనా వెనకడుగు వేయొద్దు
ఆ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
రాష్ట్ర సచివాలయంలో హరిత నిధి సమీక్షా సమావేశం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవుల్లో ఆకస్మికంగా తలెత్తే మంటలను (Forest Fires) తగ్గించేందుకు స్థానికులకు శిక్షణ (Training) ఇవ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ సూచించారు. అడవుల పరిరక్షణ కోసం ఏ చర్యకైనా వెనకడుగు వేయొద్దని ఆ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎకో టూరిజాన్ని (Eco Tourism) డెవలప్ చేసి విదేశీయులను కూడా ఆకర్షించేలా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని చెప్పారు. ఈ విషయలో అటవీ, టూరిజం, పరిశ్రమల శాఖలతో సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు అవసరమని తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీలో ‘తెలంగాణ హరిత నిధి’(Telangana Haritha Nidhi) రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, PCCF(HOFF) డాక్టర్ సువర్ణ, సునీత భగవత్, సీసీఎఫ్ డాక్టర్ జి.రామలింగం(సోషల్ ఫారెస్టు), డాక్టర్ బీమా నాయక్, ప్రియాంక వర్గీస్, అన్ని జిల్లాల డీఎఫ్ఓలు, ఆర్థిక శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో హరితనిధి వినియోగంపై సమగ్ర చర్చ జరిపారు. నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, సంరక్షించడం, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ వంటివాటిపై మంత్రి సురేఖ సూచనలు, సలహాలు ఇచ్చారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా చర్చించారు. అడవుల్లో మంటలు చెలరేగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దాని ద్వారా అటవీ సంపద, జంతువుల పరిరక్షణ చేపట్టినట్లు అవుతుందని పేర్కొన్నారు.
2025-26 బడ్జెట్ శాంక్షన్లపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఫైర్స్ మీద సమావేశంలో చర్చ జరగ్గా వాటిని తగ్గించేందుకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలపై మంత్రి ఆరా తీశారు. వీటిపై.. రానున్న రోజుల్లో మరింత శాస్త్రీయంగా ముందుకు వెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఏమైనా ఇబ్బందులు తలెత్తితే… ఎప్పటికప్పడు తమకు తెలియజేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
హరిత నిధి కింద నర్సరీల పెంపకం (గంధపు చెక్క, వెదురు, టేకు, శాంటాలమ్ ఆల్బమ్) మౌలిక సదుపాయాల అభివృద్ధితో 26 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, నిర్వహణ చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. 4 ఎకో టూరిజం ప్రదేశాల అభివృద్ధి, కాకతీయ జూలాజికల్‌లో అభివృద్ధి, నిర్వహణ చేయడం జరుగుతుందన్నారు. పార్క్, హనుమకొండ 24 గ్రీనరీ ప్రాజెక్టుల అభివృద్ధి (అవెన్యూ ప్లాంటేషన్లు) సిబ్బందికి సామర్థ్య నిర్మాణ శిక్షణలు ఇచ్చినట్లు తెలిపారు.
విద్యార్థులకు వనదర్శిని కార్యక్రమాలు మొదలైనవి చేపట్టామన్నారు. నాగార్జునసాగర్‌లో వన్యప్రాణుల నిర్వహణ చేపడుతున్నామన్నారు. నారాయణపేటలో బ్లాక్‌బక్ రెస్క్యూ & పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అగ్ని రక్షణ, నియంత్రణ నిర్వహణ చేపడుతున్నారు. వరంగల్ నుంచి మేడారం రహదారి వరకు (సమ్మక్క సారక్క కారిడార్) అవెన్యూ, ఇతర తోటల పెంపకం చేపట్టడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని మాస్ ట్రీ ఫాల్ వద్ద పునరుజ్జీవన కార్యకలాపాల చేపట్టడం జరుగుతుందని వివరించారు.
