Tuesday, February 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంKTR | అన్నీ తానై.. ఓటమి పాలై

KTR | అన్నీ తానై.. ఓటమి పాలై

  • ఉపఎన్నిక ఫలితాలలో బీఆర్ఎస్ ఓటమి
  • పెద్దాయన లేకపోవడం గెలుపుకి పెద్ద మైనస్
  • ప్రచారం లో కేసీఆర్ దూరం తోనే ఓటమి
  • ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం..
  • కార్యకర్తలు, మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు

జూబిలీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలలో బీఆర్ఎస్ ఓటమి ఇప్పుడు రాజకీయ సమీకరణాలను కుదిపేస్తున్నాయి. పార్టీ గెలుపుపై నమ్మకంగా ఉన్న సందర్భంలో ఈ ఓటమి షాక్ ఇప్పుడు శ్రేణుల మనసుల్లో గందరగోళాన్ని రేపుతోంది . ఈ ఓటమి కేవలం ఓటర్ల తీర్పు మాత్రమే కాదు.. పార్టీ నాయకత్వం, ప్రజలతో ఉన్న అనుబంధం, ముఖ్యంగా ప్రచారంలో కెసిఆర్ “ఫేస్ వాల్యూ” లేకపోవడం వల్ల ఏర్పడిన తేడా కి స్పష్టమైన సంకేతం గా మారింది. తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా నిలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈసారి బైపోల్ ప్రచార వేదికలపై కనిపించకపోవడం, బీ ఆర్ ఎస్ కార్యకర్తల్లో తీవ్ర నిరాశను కలిగించిందని అంటున్నాయి బీ ఆర్ ఎస్ శ్రేణులు.

బైపోల్ ప్రచారం లో “పెద్దాయన ఎక్కడ?” అనే ప్రశ్న ప్రతి సభలో, ప్రతి వీధిలో వినిపించింది. కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మహ్మూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, పద్మారావు గౌడ్ వంటి మంత్రులు, మాజీ మంత్రులు ఎంతగా శ్రమించినా, కెసిఆర్ లాంటి నాయకుడి గర్జన లేకపోవడంతో ప్రచారం ఉత్సాహాన్ని కోల్పోయింది. ఫలితం గా ఓటమి తప్పలేదు అంటున్నారు. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కెసిఆర్ పేరు ఉన్నప్పటికీ ఆయన వేదికపై కనబడకపోవడం పార్టీ శ్రేణులలో పెద్ద చర్చగా మారింది. బీ ఆర్ ఎస్ శ్రేణులు ఇప్పుడు ఒకే మాట చెబుతున్నాయి..

- Advertisement -

“కెసిఆర్ లేని బీ ఆర్ ఎన్ అంటే ఆత్మ లేని శరీరం లాంటిది.” తెలంగాణాను నిర్మించిన నాయకుడు గెలుపు కోసం వేదికపైకి రాకపోవడం ఓటర్లలో భావోద్వేగ దూరాన్ని సృష్టించింది. జూబిలీహిల్స్ లో ప్రచారం బాగా సాగిందని చెప్పినా, కెసిఆర్ లాంటి ఫేస్ లేకపోవడం ఆ ప్రభావాన్ని ఓటమి దిశగానే నడిపించింది . ఇక ఇదేవిధంగా కల్వకుంట్ల ఫ్యామిలీ లో ఒకరుయిన కవిత జాగృతి పేరుతో తెలంగాణ ను చుట్టేస్తూ, మహిళలు కొందరు బీ ఆర్ ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఆమెతోనే ఉండటం, ప్రచారం లో పాల్గొనకపోవడం కూడా ప్రధాన కారణమే. ఆమె సొంత మిగతా నేతల సమిష్టి కృషి ఉన్నా, ప్రధాన నాయకుడే లేకపోవడం ఓటర్ల మానసిక స్థితిని మార్చేసిందని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.. జూబిలీహిల్స్ బైపోల్ బీ ఆర్ ఎస్ కి ఇచ్చే సందేశం ఒక్కటే నాయకులు ఎంతమంది ఉన్నా, కెసిఆర్ లాంటి ఫేస్ వాల్యూ లేకపోతే ప్రజల గుండెల్లో పార్టీ ప్రాభవం తగ్గిపోతుంది.

ఈ ఉపఎన్నిక ఫలితాలలో ఓటమి బీఆర్ఎస్ లో అంతర్గత చర్చలకు, విశ్లేషణలకు పెద్ద స్థాయిలో ఊతమిచ్చాయి. ఓటమి కారణాలపై పార్టీ లోపల, వెలుపల చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ పరాజయానికి ప్రధాన కారణంగా ఒకే అంశం ఎక్కువగా వినిపిస్తోంది.. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రచారంలో పాల్గొనకపోవడం. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన కెసిఆర్, ఎన్నికల మైదానంలో కనిపించకపోవడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది . బీ ఆర్ ఎస్ అంటే కెసిఆర్, కెసిఆర్ అంటే బీ ఆర్ ఎస్ అని నమ్మే పార్టీ శ్రేణులు కూడా ఈసారి నేతల చురుకుదనం తగ్గినట్టు గమనించాయి.

ప్రజలు కూడా “పెద్దాయన ఎక్కడ?” అనే ప్రశ్నే ఎక్కువగా అడిగారు. జూబిలీహిల్స్ లో ప్రచారం సాగిన రోజుల్లో కేటీఆర్, ఇతర నేతలు శ్రమించినా, కెసిఆర్ లాంటి కరిష్మా ఉన్న ప్రధాన నాయకుడు సభలలో లేకపోవడం ఓటర్లలో చైతన్యం తక్కువగా ఉంచిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వృద్ధ కార్యకర్త మాటల్లో “మా పెద్దాయన ఒక్కసారి వచ్చి సభలో మాట్లాడుంటే వాతావరణమే మారిపోయేది. మేము కూడా ఉత్సాహంగా ఉండేవాళ్లం” అని చెబుతున్నారు. ఇది బీ ఆర్ ఎస్ కేడర్ లోని భావోద్వేగ స్థితిని ప్రతిబింబిస్తోంది. మరోవైపు, పార్టీ లో ఇప్పుడు నిర్ణయాధికారం ఎక్కువగా కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిందని, కెసిఆర్ ను చూడటానికి కూడా అనుమతులు అవసరమవుతున్నాయన్న భావన ఏర్పడిందనే విమర్శలు వస్తున్నాయి.

ఇది పార్టీ లో ఒక మానసిక దూరాన్ని సృష్టించిందని అనేక వర్గాల్లో వినిపిస్తున్నాయి. జూబిలీహిల్స్ బైపోల్ లో బీ ఆర్ ఎస్ ఓటమి కేవలం స్థానిక అంశం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది పార్టీలోనూ, ప్రజల్లోనూ పెరిగిన గందరగోళానికి సంకేతమని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ స్థాపకుడు కెసిఆర్ ప్రజల ముందు కనబడకపోవడం, కేటీఆర్ చుట్టూ కేంద్రీకృతమైన నిర్ణయాలు, మునుపటి ఉత్సాహాన్ని కోల్పోయిన కార్యకర్తలు.. ఇవన్నీ కలిపి ఓటర్లలో తీవ్ర నిరాశ కలిగించిందని ప్రధాన విశ్లేషణ. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం, దాని నినాదం, దాని జోష్..

అంటేనే కేసిఆర్. కెసిఆర్ ఇప్పుడు ప్రచారం వేదికలకు దూరమవడంతో, ప్రజల్లో ‘పార్టీ నాయకత్వం దారి తప్పిందా?’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ లోని సీనియర్ నేతలలో కొందరు కూడా లోపలలోనే ఈ విషయాన్ని చర్చిస్తున్నారని సమాచారం. ఇంతలో, ప్రజల్లో “మేము తప్పు చేసితిమి పెద్దాయనా” అన్న పశ్చాత్తాపపు మాటలు వినిపించడం పార్టీకి మానసికంగా తాకింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి బింబం ఒక్కసారిగా వెనుకబడి పోతే, అది కేవలం వ్యక్తి గురించి కాదు, మొత్తం ఉద్యమ భావజాలం గురించి కూడా అనుమానాలు లేవనెత్తుతున్నాయి.

ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సవాల్ ఏంటంటే.. ఈ ఓటమి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుంటుందనేది. కెసిఆర్ మళ్లీ ప్రజల మధ్యకు వస్తారా? కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ కొత్త మార్గంలో నడుస్తుందా? లేక కెసిఆర్-కేటీఆర్ సమన్వయం లోపించడం వల్ల పార్టీ భవిష్యత్తు కదలికలు మందగిస్తాయా? ఇవన్నీ రాబోయే వారాల్లోనే స్పష్టతకు వస్తాయి. ప్రస్తుతం జూబిలీహిల్స్ ఉపఎన్నిక ఓటమి బీ ఆర్ ఎస్ కు ఒక రాజకీయ సూచికగా నిలిచింది.

ప్రజల మన్ననలు గెలుచుకున్న నాయకుడు మళ్లీ మునుపటి మద్దతు పునరుద్ధరించగలడా? లేక కొత్త నాయకత్వం దిశలో పార్టీ అడుగులు వేస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానమే తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక పార్టీ ఎదుగుదలలో నాయకత్వం కీలకం. కానీ అదే నాయకత్వం దూరమైతే, ప్రజల నమ్మకం కూడా దూరమవుతుంది. జూబిలీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్కు ఇచ్చిన సంకేతం ఇదేనేమో.. నాయకుడు ప్రజల మధ్య ఉండకపోతే, ప్రజలు పార్టీకి దూరమవుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News