క్రెడిట్ కార్డులను వినియోగదారులు (Customers) రికార్డ్ స్థాయి(Record Level)లో వాడుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో 23 శాతం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఈ ఏడాది ఆగస్ట్ కన్నా సెప్టెంబర్‌లో 13 శాతం అధికంగా ఉపయోగించారు. దీనికి సంబంధించి కేర్ రేటింగ్స్ (Care Ratings) సంస్థ వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన వ్యయం ఏకంగా రూ.2.17 లక్షల కోట్లకు చేరింది. 2020 తర్వాత ఈ స్థాయిలో క్రెడిట్ కార్డులను వినియోగించటం ఇదే తొలిసారి.
పండగ సీజన్(Festival Season)తోపాటు క్రెడిట్ కార్డుల జారీ పెరగటం కూడా ఇందుకు దోహదపడింది. జీఎస్టీ రేట్లు (Gst Rates) తగ్గటం వల్ల కూడా వ్యయం వృద్ధి చెందింది. పోయినేడాది సెప్టెంబర్‌లో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 10.6 కోట్లు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 11.3 కోట్లకు పెరిగింది. కిందటేడాది ఇదే సమయంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 24 శాతం పెరగ్గా ఈసారి కొంచెం తక్కువగానే పెరిగాయి.
ప్రైవేట్ బ్యాంకులు ఈ సంవత్సరం.. వాటాల కొనుగోలు వ్యూహాలను అనుసరించటం, కో-బ్రాండెడ్ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవటం, డిజిటల్ ఆఫర్లను అందుబాటులోకి తేవటం ద్వారా క్రెడిట్ కార్డుల సంఖ్యను పెంచాయి. అయితే.. ఖర్చు విషయంలో వినియోగదారులు ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ కార్డుల కన్నా ప్రభుత్వ బ్యాంకుల క్రెడిట్ కార్డులనే అధికంగా వినియోగించటం గమనార్హం.
