DMEకి AHCPA వినతిపత్రం
హైదరాబాద్: వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకురావడానికి బి.ఎస్‌సి. ఫిజిషియన్ అసిస్టెంట్ (Physician Assistant-PA) కోర్సు ప్రారంభించాలని అల్లైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (AHCPA) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.వంశీ ప్రసాద్.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME-అకాడమీ)కి, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(KNRUHS) వీసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల వైద్య అవసరాలను గుర్తించి చొరవ తీసుకోవాలని అన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ కోర్సు కీలకమని చెప్పారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వృత్తి నిపుణులు ఇప్పటికే తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కోర్సును ప్రారంభిస్తే మన విద్యార్థులు డాక్టర్లకు సహాయకులుగా, సుశిక్షితులైన వైద్య నిపుణులుగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో సేవ చేయగలుగుతారు.
తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల ఫిజిషియన్ అసోసియేట్లను ప్రస్తావిస్తూ స్థానిక అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మన యువతకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ కోర్సు ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఏర్పాటైతే వైద్యులపై పనిభారం తగ్గడంతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
