పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, పర్యాటకాన్ని పెంపొందిస్తాం
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
నర్సాపూర్ నియోజకవర్గంలో ఎకో పార్క్, కాటేజీల ప్రారంభం
తెలంగాణను ఎకో టూరిజం హబ్ (Eco Tourism Hub) చేస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరానికి అతి సమీపంలో ఉన్న నర్సాపూర్ అడవులను (Narsapur Forest) ప్రకృతి ప్రేమికులతో పాటు పర్యాటకులకు నచ్చేలా అర్బన్ ఎకో పార్క్‌ను తీర్చిదిద్దామన్నారు. శనివారం ఆమె నర్సాపూర్ నియోజకవర్గంలో ఎకో పార్క్(Eco Park), కాటేజీ(Cottage)లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యాటకుల(Tourists)ను మరింతగా ఆకట్టుకోవడంతో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రంగా నర్సాపూర్ అడవులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం అర్బన్ ఎకో పార్కులో అధునాతన సౌకర్యాలతో కాటేజీల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. అటవీ శాఖ, ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్-మెదక్ జాతీయ రహదారి(Hyderabad-Medak National Highway)కి సమీపంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేయబోతున్నట్లు తెలిపారు.

నర్సాపూర్‌కు ఎవరు వచ్చినా …అర్బన్ ఎకో పార్కును సందర్శించి అక్కడి పరిసరాలు, ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇక్కడ వాచ్‌టవర్ అందరినీ ఆకట్టుకుంటుందని అభప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాచ్‌టవర్ ఎక్కి అటవీ ప్రాంతం అంతా చూడటం ఓ గొప్ప అనుభూతిగా ఉంటుదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రైవేట్ కాటేజీలను తలదన్నేలా ఇక్కడ అర్బన్ ఎకో పార్కులో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

ఇక ప్రస్తుతం నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి, ఈ నేపథ్యంలో పచ్చదనం కాపాడేందుకు ఎకో పార్కులను మెరుగుపరచడం, మరింత అభివృద్ధి చేయడం అనివార్యంగా మారిందని మంత్రి వివరించారు. గతంలో మన మానవ జీవన విధానం అడవుల్లోనే ప్రారంభమైందని, ఇప్పుడు పట్టణీకరణ పేరుతో పెరిగిన కాలుష్యం కారణంగా… ప్రజలంతా మళ్ళీ అడవుల వైపు చూస్తున్నారన్నారు. అందుకే తమ ప్రభుత్వం అర్బన్ ఎకో పార్కు అభివ్రుద్ధి పరిచిందన్నారు.

ప్రస్తుత యాంత్రీకరణ జీవన విధానంలో వారంతంలో ఒక్కసారైన కుటుంబం ఇలాంటి ఆహ్లదకరమైన వాతావరణంలో గడిపేందుకు అర్బన్ ఎకో పార్క్ లో అన్నీ సౌకర్యాలు ఉన్నాయన్నారు. అయితే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు అడవులను ఫోన్‌లలో, ఇన్‌స్టాగ్రాం రీల్స్ లో చూపుతున్నారని, దీనంత దారుణం మరొకటి లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కళ్లముందు సహజ సిద్ధంగా సాక్షాత్కరిస్తే అద్భుతంగా ఉంటుందని వివరించారు. అందుకే అర్బన్ ఎకో పార్కులను అటవీ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. పర్యాటక పరంగా నర్సాపూర్ మరింత అభివృద్ధి చెందనుందని, ఇప్పటికే అర్బన్ పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగిందని అధికారులు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ ఎకో పార్క్ లో పాత కాటేజీల పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో 21 కాటేజీలు, ఒకే బ్లాక్‌లో ఉండే విధంగా మరో 12 కాటేజీలు, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్, సెమినార్ హాల్, ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్, నెట్ క్రికెట్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, పర్యాటకులకు భోజన సదుపాయం కల్పించేందుకు రెస్టారెంట్, దానిని ఆనుకొని కిచెన్ నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు .అంతేగాక కాటేజీల పరిసరాల్లో అక్కడక్కడ ఖాళీ స్థలంతో పాటు కొంత ఏరియాలో మొక్కలు నాటామన్నారు.

4,300 ఎకరాలలో జిల్లా అటవీ విస్తీర్ణం ఉండగా 600 ఎకరాలలో నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు, ఆఫీసర్స్ గెస్ట్‌హౌజ్, పర్యాటకుల కాటేజీలు, రిసెప్షన్ సెంటర్స్, కిచెన్ కం స్టోరేజీ తదితర వసతులను మెరుగుపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. పార్కులో చెక్‌డ్యామ్స్, రాక్ ఫీల్ డ్యాం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే పార్కులో ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దీంతో పాటు నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిన్న కొండలు, రాతి మైదానాలతో కూడి ఉంటుందన్నారు.

చుక్కల జింకలు, నెమళ్లు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు వంటి జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయని మంత్రి తెలిపారు. అతిథి గదులతో కూడిన బ్యాంకెట్ హాల్ , పర్యావరణ విద్యా కేంద్రం (క్లాస్ రూములు, బోర్డ్ రూమ్, మ్యూజియం) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. నడక మార్గాలు, నీరు, విద్యుత్, అగ్ని మాపక వ్యవస్థ,తో పాటు సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థ, పిల్లల ఆట స్థలం, బాక్స్ క్రికెట్, టేబుల్ టెన్నిస్, చెస్ మొదలైన ఆటలు ఆడుటకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ హమ్మద్ నదీమ్ ,ప్రధాన అటవీ సంరక్షణ అధికారి,సువర్ణ, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రియాంక వర్గీస్,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్,మృగవని గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ ఎండి ,విష్ణు చైతన్య రెడ్డి ,జిల్లా అటవీ అధికారి జోజీ, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

