ఆస్ట్రేలియా పరిశోధకులను కోరిన మంత్రి నారా లోకేష్
ఏఐ ఆధారిత వ్యవసాయ హబ్స్ ఏర్పాటులో సహకారం అందించండి
ఆధునిక వ్యవసాయ నైపుణ్యాలను ఎన్జీ రంగా వర్సిటీతో కలిసి పంచుకోండి
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆస్ట్రేలియా(సిడ్నీ): ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ(WSU)ని సందర్శించారు. ఈ సందర్భంగా WSU అధికారులు మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం వర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్‌లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(NG Ranga Agricultural University)తో కలిసి పంచుకోవాలని కోరారు.

‘రైతులు, అగ్రి-ప్రొఫెషనల్స్‌కు స్మార్ట్ ఫార్మింగ్(Smart Farming) టెక్నిక్‌లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించండి. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించండి. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధన ఆధారిత సూచనలు అందించండి’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
WSU సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులు యూనివర్సిటీ ప్రత్యేకతలను తెలియజేశారు. 1989లో ఆస్ట్రేలియాలోని గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీలో స్థాపించిన వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం (WSU) కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్స్, ఇన్నోవేషన్స్‌పై దృష్టిసారించి ప్రముఖ విద్యాసంస్థగా అభివృద్ధి చెందిందని చెప్పారు. పరిశ్రమతో అనుసంధానమైన కోర్సులకు ప్రసిద్ధి చెందిన WSU ఆరోగ్య, విద్య, వ్యాపార, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రావీణ్యం సాధించింది. స్థిరమైన అభివృద్ధిపై ప్రభావం చూపడంలో ప్రపంచంలో నంబర్1 స్థానంలో ఉంది.
