- బొమ్మరాసిపేట్‌లో అధికారుల చోద్యం.. రికార్డులో పేరు మార్చి వీఆర్వో ఘన కార్యం
- వ్యాపారవేత్తకు అడ్డదారిలో పాస్‌బుక్‌ల జారీ.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎవరి వైపు?
- అన్యాయానికి గురైన అన్నదాతల వైపా? పారిశ్రామికవేత్త పక్షానా?
- హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగానే దౌర్జన్యంగా పంట పొలాల్లోకి ప్రవేశం
- పచ్చటి పొలాలను నాశనం చేస్తూ వాటి చుట్టూ బౌండరీస్ ఏర్పాటుచేసే యత్నం
- కోర్ట్ ఆర్డర్‌ను ధిక్కరించి.. ప్రవేశించినందుకు పోలీసులకు రైతుల ఫిర్యాదు..
రైతును రాజును చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతారు. రైతుల కోసం మెగాస్టార్లు, సూపర్ స్టార్లు సినిమాలు తీస్తారు. వారికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక రైతును కనీసం మనిషిగా కూడా చూడటం లేదు. రైతు తాను పండిరచిన ధాన్యాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి అధిక మొత్తం చెల్లించి కొనాల్సిన దుర్భర పరిస్థితి నేడు నెలకొంది. ఇదేమిటని అడిగితే దౌర్జన్యం. ఇప్పుడు ఆ కథనం మీ ముందుకు తీసుకొస్తున్నాం.
వేల కోట్లకు అధిపతి అయిన ఓ పారిశ్రామికవేత్తకు, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సామాన్య రైతులకు మధ్య జరుగుతున్న భూవివాదం ఇది. మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమాలను మించిన యథార్థ గాధ ఇది. 1960`1975 పహాణి ప్రకారం పట్టాదారు కాలంలో సుదర్శన్ రావు, తులశమ్మ, వెంకయ్య, నర్సింహ.. అలాగే కబ్జాదారుకాలం అనగా పొలం సాగు చేసేవారి పేర్లు.. చాకలి నరసింహ, వెంకయ్య, ఎల్లయ్య. వీరు రికార్డ్ ప్రకారం ఉన్నారు. అయితే 1975లో ఉన్నట్టుండి 38ఈ టేనెన్సీ యాక్ట్ కింద పహాణీలో బాబాగూడా గ్రామానికి చెందిన కొంత మంది రెడ్డి కులస్తుల పేర్లు రికార్డులకు ఎక్కాయి. మరి ఇది ఎలా సాధ్యమైంది.? పట్టాదారులు అమ్మలేదు. కబ్జాదారులకు రాసి ఇవ్వలేదు. కేవలం రెవెన్యూ అధికారులు చేసిన మాయాజాలంతో నేడు సామాన్య రైతులకు, ఓ పారిశ్రామికవేత్తకు మధ్య జరుగుతున్న భూవివాదం వెలుగుచూసింది.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేట్ గ్రామంలో కోట్లాది రూపాయల విలువ కలిగిన వ్యవసాయ భూములపై రైతులకు, పారిశ్రామికవేత్తకు మధ్య నెలకొన్న భూవివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. రికార్డుల మార్పులు, పాస్‌బుక్స్ అవకతవకలు, అధికార దుర్వినియోగంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామమంతా ఆందోళనలతో మారుమోగుతోంది. అసలు రైతులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అనే ప్రశ్న ఇప్పుడు బొమ్మరాసిపేట్ ప్రజలను మాత్రమే కాదు.. మొత్తం రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలుస్తోంది.
రెవెన్యూ రికార్డుల్లో గందరగోళం.. రైతుల ఆరోపణలు..
తహశీల్దార్ అధికారికంగా రికార్డుల్లో పేర్లు మార్చి కోట్ల విలువ చేసే భూములను పారిశ్రామికవేత్తకు కేటాయించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ ఆధారంతో భూమిని ఎవరికి కేటాయించారు? పాస్‌బుక్స్ ఎలా జారీ అయ్యాయి? అనే రైతుల ప్రశ్నలకు ఇప్పటి వరకూ అధికారుల నుంచి స్పష్టత లభించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది..

చరిత్ర చెబుతున్న నిజం.. 1960? 75 పహాణీ రికార్డులు రైతుల పక్షం..
1960 నుంచి 1975 వరకు ఉన్న ప్రభుత్వ పహాణీ పత్రాలు సుదర్శన్ రావు, తులశమ్మ, వెంకయ్య, నర్సింహ తదితర రైతులనే పట్టాదారులుగా స్పష్టంగా చూపిస్తున్నాయి. సాగుదారులుగా నరసింహ, వెంకయ్య, యెల్లయ్య పేర్లు కూడా అందులో ఉండటం రైతుల హక్కును మరింత బలపరుస్తోంది. అయితే 1975 తర్వాత 38ఈ టెనెన్సీ యాక్ట్ కింద అపరిచిత రెడ్డి కుటుంబాల పేర్లు పుట్టుకొచ్చిన తీరు రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పేర్లు ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? అనేది అంతుబట్టడంలేదు.
కలెక్టర్ దర్యాప్తు ఆదేశాలు.. 10 ఏళ్లుగా పెండిరగ్..
రైతుల ఫిర్యాదులను 2014లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్‌గా పరిగణించి శామీర్‌పేట్ తహశీల్దార్‌కు విచారణ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఫైల్ పెండిరగ్‌లోనే ఉండటం రైతుల్లో అసంతృప్తిని రగిలిస్తోంది.

హైకోర్టు కేసులో పెండిరగ్‌లో ఉన్నా.. కంచె పనులు..
ఈ భూవివాదంపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో వ్యవసాయ భూమిలోకి చొరబడి బౌండరీ వాల్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ రైతులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడిరచారు.
రైతుల ప్రశ్నలు.. అధికారుల మౌనం..
పట్టాదారులు అమ్మని భూమి పేరు ఎలా మారింది? సాగుదారులు రాసి ఇవ్వని భూమికి యాజమాన్యం ఎలా మారింది? రికార్డ్‌ల్లో చోటచేసుకున్న అవకతవకల వెనక ఎవరున్నారు? కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఎవరి కోసం మార్పులు జరిగాయి? అని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది.

మన భూమి.. మన హక్కు.. రైతుల ఉద్యమం..
పూర్వీకుల నుంచి సాగుచేస్తున్న భూములపై చట్టబద్ధమైన హక్కులు ఇవ్వాలని, న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మాకు న్యాయం కావాలి అనే నినాదాలతో గ్రామం ఒక్కటిగా నిలుస్తోంది.
ప్రధాన ప్రశ్నలు.. ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం ముందున్నాయి.
జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటారా? చరిత్రను సాక్ష్యం చేసి రైతులకు హక్కులు తిరిగి ఇస్తారా? రికార్డుల మార్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? భూ వివాదానికి ముగింపు ఎప్పుడు? ప్రస్తుతం బొమ్మరాసిపేట్ రైతుల పోరాటం మరింత ముదురుతోంది. రాష్ట్రం మొత్తం ఈ భూవివాదంపై దృష్టి పెట్టాల్సిన కీలక దశ వచ్చింది. మరిన్ని వివరాలు మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.
