Homeఆదాబ్ ప్రత్యేకంAadab Effect | ‘ఆదాబ్ హైదరాబాద’.. వరుస కథనాలకు స్పందన… !

Aadab Effect | ‘ఆదాబ్ హైదరాబాద’.. వరుస కథనాలకు స్పందన… !

పేద ప్రజలకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద స్పష్టం చేశారు. ఈనెల 12 నుండి ‘ఆదాబ్ హైదరాబాద’ దినపత్రికలో వరుస కథనాలపై శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, రికార్డు నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.

Collector Satya Sarada Inspects Parvathagiri PHC01

డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ తిరుపతికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన హెల్త్ సూపర్వైజర్ వసంతను మందలించారు. అలాగే ప్రజల్లో వివాహ వయస్సుపై అవగాహన కల్పించి బాల్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించేందుకు అవసరమైన అనుమతులు పొందిన అనంతరం వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు.

- Advertisement -

ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అత్యవసర విభాగం సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా తగిన స్టాక్ ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఆమె, ఆసుపత్రి మరుగుదొడ్లలో నీటి సదుపాయం సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Collector Satya Sarada Inspects Parvathagiri PHC1

వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి టాయిలెట్లను శుభ్రం చేసి రికార్డులో నమోదు చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో రోగులకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని, అందుకు తగిన విధంగా వైద్య సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ హెచ్చరించారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి సంతృప్తిగా సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్యాధికారి బి. సాంబశివరావు, తహసిల్దార్ టి.వెంకట స్వామి, ఎంపీడీవో ఎం.శంకర్ నాయక్, పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్, మెడికల్ ఆఫీసర్లు డా:ఉదయ్ రాజ్, డా:మౌనిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News