Homeఆదాబ్ ప్రత్యేకంJawahar Nagar | టౌన్ ప్లానింగ్ అధికారి ఆడిందే ఆట పాడిందే పాట

Jawahar Nagar | టౌన్ ప్లానింగ్ అధికారి ఆడిందే ఆట పాడిందే పాట

మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జవహర్ నగర్ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ నిబంధనలను పట్టించుకోకుండా సెల్లార్‌లతో కూడిన కమర్షియల్ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారుల పక్కన కోట్ల విలువ చేసే స్థలాల్లో భారీ భవనాలు నిర్మించడంతో పాటు రోడ్లను ఆక్రమిస్తూ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Jawahar Nagar Town Planning Officials Corruption1

జవహర్ నగర్ ప్రాంతం నగర పాలక పరిధిలోకి వచ్చినప్పటి నుండి గృహ నిర్మాణాల అనుమతుల రద్దు నిబంధన అమల్లో ఉన్నా గత ఆరు సంవత్సరాలుగా వందలాదిగా అక్రమ భవనాలు వెలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని, లంచాల కారణంగానే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
Jawahar Nagar Town Planning Officials Corruption

మున్సిపల్ నిబంధనలను విస్మరిస్తూ జవహర్ నగర్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న అధికారులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత అధికారులను విధుల నుండి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గృహ నిర్మాణాలకు అనుమతులు లేకపోవడం స్థానికులకు శాపంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత ఇళ్లు శిధిలావస్థకు చేరుకోవడంతో కొత్త నిర్మాణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

Jawahar Nagar Town Planning Officials Corruption2

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు మధ్యవర్తుల ద్వారా లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న భవనాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Jawahar Nagar Town Planning Officials Corruption01

ఇప్పటికైనా గృహ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని జవహర్ నగర్ అభివృద్ధికి సహకరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమతులు లేకపోవడం వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి కూడా నష్టం జరుగుతోందని, సరైన విధానాలు అమలు చేస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News