ఓట్లకు నోట్లు తీసుకోవటమా?
ప్రజల్లో మరీ ఇంత స్వార్థం ఎందుకు?
మన ఊరి వాడి దగ్గరే మనీ ఆశించటం ఎంత వరకు కరెక్ట్?
ఇద్దరు, ముగ్గురు దగ్గర డబ్బు తీసుకొని ఒక్కరికే ఓటేయటం నైతికమా?
గెలిచేది ఒక్కరే అని తెలిసినప్పుడు ఓడిపోయే అభ్యర్థుల గురించి ఆలోచించరా?
ఓటర్లలో మార్పు వచ్చేది ఎప్పుడు? అంటున్న ప్రజాస్వామికవాదులు, పరిశీలకులు
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం రోజూ కలిసుండే మనుషులను, మనసులను దూరం చేసుకోవద్దని విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు(Gram Panchayat Elections) నేటి(బుధవారం)తో ముగుస్తున్నాయి. అయితే.. ఈ సందర్భంగా ఒక అంశం తీవ్రంగా చర్చకు వస్తోంది. అదే.. ఓటుకు నోటు. లోక్‌సభ ఎన్నికల్లోనో, శాసన సభ ఎలక్షన్లలోనో ఓటర్లు రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ.. సర్పంచ్ ఎన్నికల్లో కూడా డబ్బులు (Money In Sarpanch Elections) తీసుకోవటం ఎంత వరకు కరెక్ట్ అని పరిశీలకులు, ప్రజాస్వామిక, మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు.
విలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల(Village President Elections)లో వంద శాతం మన ఊరి వాళ్లే పోటీ చేస్తుంటారు. మన అన్నో, మన బాబాయో, మన ఇంటి చుట్టుపక్కల వాళ్లో బరిలో నిలుస్తుంటారు. కాబట్టి.. వాళ్ల గురించి మనకు బాగానే తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ల గుణగణాలు, చదువు, ఇతర అర్హతలు చూసి ఓటేయాలి గానీ వాళ్ల దగ్గర కూడా ఓటుకు నోటు తీసుకోవటం నైతికంగా సమంజసమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక అభ్యర్థిని నమ్ముకొని మన ఊరును బాగుచేస్తాడా లేదా అనేది పరిశీలించి ఓటు వేయాలి గానీ డబ్బు ఆశించటం సరికాదు కదా.
కానీ.. ఇద్దరు, ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకొని ఒక్క అభ్యర్థికే ఓటేస్తే ఎలా? పోటీలో ఎందరు ఉన్నా గెలిచేది ఒక్కరే కదా అని తెలిసి కూడా ఇద్దరు, ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటే ఓడిపోయే అభ్యర్థుల పరిస్థితి ఏంటి? అని ఆలోచించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంత మంది డబ్బులు ఇస్తే అంత మంది దగ్గర తీసుకోవటం, ఒక్కరిని మాత్రమే ఓటేసి గెలిపించటం మానవత్వం అనిపించుకుంటుందా? ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో తెలిసి కూడా ఆశించటం అనేది సరికాదు. గ్రామ ప్రజలు నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పటికే రెండు విడతల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు చాలా మంది కాలం చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లె ప్రజల్లో మానవత్వం(Humanity), నైతిక విలువలు(Moral Values) నశించాయా అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే.. నిన్నటి వరకు మనకు సాయం చేసిన వ్యక్తి గానీ లేదా రేపు మనకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన మనిషి గానీ ఎన్నికల్లో నిలబడితే అతని దగ్గర నుంచి డబ్బు కోరుకోవటం అంటే మానవ సంబంధాలకు, మానవత్వ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లే లెక్క. కేవలం డబ్బు కోసం ఈవిధంగా వ్యవహరించటం అంటే జీవితంలో దిగజారటంగానే పరిగణించాలి.
మన ఊరులో ఎవరికైనా చిన్న గాయమైనా లేదా ఏదో అనారోగ్యంతో చనిపోయినా లేదా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా లేదా అనుకోకుండా ప్రమాదం జరిగితే గ్రామ గ్రామమే బాధపడుతుంది కదా. అందులో అమ్మలక్కలైతే దారిపొడవునా ఏడ్చుకుంటూ స్మశానం వరకు వస్తారు కదా. మరి, ఇంత విలువ గల ఆప్యాయతలను, అనుబంధాలను ఎందుకు మర్చిపోతున్నారు. వాళ్లకు ఓటు కోసం ఇచ్చే డబ్బు నీ ఒక్కరోజు భోజనం ఖర్చు కాదు కదా. దానికోసం ఇంత దిగజారటం అంత అవసరమా? ప్రజలారా ఒక్కసారి మీ చెయ్యిని మీ గుండె పైన వేసుకొని ఆలోచించండి. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి.
పల్లెల్లో ప్రేమానురాగాలకు కొదవ ఉండదు. ఏదైనా శుభకార్యం జరిగితే అందరూ కలిసే వెళతారు. బస్సుల్లో గానీ ఆటోల్లో గానీ ఐదుగురు లేదా పది మంది చొప్పున ఒక్కటిగా ప్రయాణం చేస్తుంటారు. పనులకు వెళ్లినా ముఠాలుగానే ముచ్చట్లు పెట్టుకుంటూ పోతారు. నిత్యం అంత ఐకమత్యంగా ఉండే ప్రజలు కేవలం ఓట్ల డబ్బుల కోసం విడిపోవటం చిన్నతనంగా అనిపించటం లేదా? ఓట్ల డబ్బులు మహా అయితే ఒకటీ రెండు రోజులే ఉంటాయి. కానీ ఊరి జనం మధ్య శాశ్వతంగా, మనస్ఫూర్తిగా ఉండిపోవాల్సిన పలకరింపులను పైసల కోసం పణంగా పెట్టకూడదు కదా.
గ్రామాల్లో పిల్లలందరూ ఒకే బడికి వెళతారు. ఒక చోట కలిసి ఆడుకుంటారు. అలాంటి ప్రదేశాల్లో ఆ పిల్లలు ఈ ఎలక్షన్ల గురించి మాట్లాడుకునే క్రమంలో మీ అమ్మానాన్న ఓట్ల కోసం డబ్బులు తీసుకున్నారంట కదా అని మీ పిల్లల్ని వాళ్ల దోస్తులు అడిగితే అప్పుడు వాళ్లు ఎంత బాధపడతారో మీరు ఒక్కసారైనా ఆలోచించారా?. పసి మనసులపై ప్రతికూల ప్రభావం చూపే అలాంటి మాటలు మీ పిల్లలు పడటం మీకెంత భావ్యంగా ఉందో గమనించండి. కష్టపడి సంపాదించుకున్నదే మనతో ఉంటుంది గానీ ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోతుందని గుర్తుంచుకోండి.
అసలు ఓటుకు నోటు తీసుకోవటమే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగం ప్రసాదించిన అమూల్యమైన హక్కు ఓటు. ఆయుధం లాంటి ఓటుకు విలువ కట్టి అమ్మేసుకుంటే అసలు ప్రజాస్వామ్యానికి, ఓటర్ల అభిప్రాయానికి విలువేం ఉంటుంది. డబ్బు తీసుకొని ఓటేస్తే గెలిచిన అభ్యర్థిని ప్రశ్నించే అవకాశం కోల్పోతామనే కామన్ సెన్స్‌ను ప్రజలు, ఓటర్లు కోల్పోవటం ప్రజాస్వామ్యంలో బాధాకరం. దీనిపట్ల ప్రజాస్వామికవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగైదు మండలాలు ఉంటాయి. ఒక లోక్‌సభ నియోజకవర్గంలో ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సాధారణ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచినా, ఓడినా మనకు నిత్యం కనిపించరు. గెలిచినా కూడా మనం అసలు వాళ్ల దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లకపోవచ్చు. ఏదైనా పని ఉంటే ఆఫీసర్ల ద్వారా చేయించుకుంటాం. కాబట్టి అలాంటి అభ్యర్థులు ముక్కూమొహం తెలియనివాళ్ల ద్వారా ఓటు కోసం నోటు పంపిస్తే తీసుకున్నా పెద్దగా ఫరక్ పడదు.
కానీ.. పొద్దున లేస్తే.. ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాల్సిన వ్యక్తుల నుంచి ఓట్ల కోసం డబ్బు తీసుకోవటం అనేది ఒక రకంగా మనసు చంపుకొని చేయాల్సిన పని. ఇవాళ ఓట్ల కోసం గుండె రాయి చేసుకొని నోట్లు తీసుకున్న నువ్వు.. రేపు నీకేదైనా అవసరం వస్తే మళ్లీ ఆ వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్లగలవు? ఒక వేళ వెళ్లినా కూడా నోరు తెరిచి సాయం అడగగలవా?. సరే అడిగావే అనుకో.. అతను నీకు అండగా నిలుస్తాడా? మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన బంధం ఎన్నికల సమయంలోనే డబ్బుతోనే తెగిపోయినప్పుడు మళ్లీ ఎలా చిగురిస్తుంది?
కాబట్టి.. ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు ఇకనైనా మారాలని మానవతావాదులు కోరుతున్నారు. ఎన్నికలనేవి ప్రజలను ఏకతాటి మీదికి తీసుకురావాలి గానీ ప్రజలను వర్గాల వారీగానో, కులాలు, మతాలను బట్టో విడదీయకూడదు అని సూచిస్తున్నారు. దేశానికి పల్లెటూళ్లే పట్టుగొమ్మలు. అలాంటి గ్రామాలు ఆదర్శంగా నిలవాలి తప్ప.. తప్పుడు మార్గంలో నడవకూడదు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం రోజూ కలిసుండే మనుషులను, మనసులను దూరం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
