HomeతెలంగాణJournalists | జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ..

Journalists | జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ..

  • ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ మీడియా అకాడమి..
  • ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా కథనాలు రాయొద్దని విన్నపం..

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి అమలుపై ప్రచురితమైన కథనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ఉండటం విచారకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తోంది.

ప్రత్యేకించి 2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించి, జర్నలిస్టులకు సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా పలు సంస్కరణలు అమలు చేసింది. గతంలో సంక్షేమ నిధి కమిటీ సమావేశాలు ఎక్కువ విరామంతో నిర్వహించబడగా, ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ అందిన ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఈ విధానంతో దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెరగడమే కాకుండా మరణించిన కుటుంబాలకు సహాయానికి సంబంధించిన అర్హత గల ఒక్క దరఖాస్తు కూడా ప్రస్తుతం పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, అంగవైకల్యం/ ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం, విద్యా సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేస్తూ సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తోంది.

జర్నలిస్టుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో గవర్నింగ్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో తీవ్రమైన అనారోగ్యం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన జర్నలిస్టులకు కేవలం రూ.50 వేల ఆర్థిక సహాయం మాత్రమే అందించబడేది. అయితే ప్రస్తుత గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో ఆ సహాయాన్ని రెట్టింపు చేసి రూ.1 లక్షకు పెంచడం జరిగింది.

ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటికే గణనీయమైన సంఖ్యలో అర్హులైన జర్నలిస్టులు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం పొందారు. ఈ నిర్ణయాన్ని లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నింగ్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

జర్నలిస్టుల పిల్లలకు విద్యా సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు ఆర్థిక తోడ్పాటు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సంక్షేమ నిధి ద్వారా అర్హులైన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.

గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం చిన్న బ్యాచ్‌లుగా సుమారు 75 మంది జర్నలిస్టులతో నాణ్యమైన శిక్షణ కార్యక్రమాలు యిప్పటికే పలు జిల్లాల జర్నలిస్టులకు ఆధునిక మీడియా ధోరణులు, డిజిటల్ జర్నలిజం, ఫ్యాక్ట్ చెకింగ్, కృత్రిమ మేధస్సు వినియోగం, ఎన్నికల నిబంధనలు, మీడియా నైతిక విలువలు వంటి అంశాలపై నిపుణులతో ప్రత్యక్షంగా శిక్షణ అందిస్తున్నారు.అది కొనసాగుతుంది. యివే కాకుండా గిరిజన జర్నలిస్టులకు, ఉర్దూ జర్నలిస్టులకు, మహిళా జర్నలిస్టులకు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు ప్రత్యేక సదస్సులను, శిక్షణా కార్యక్రమాలను అకాడమి నిర్వహించింది.

యిటీవల సర్ పై గోష్టిని కూడా నిర్వహించింది. ఈ విధానం వల్ల ప్రతి జర్నలిస్టుకు సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం, ప్రాక్టికల్ అవగాహన, నైపుణ్యాల పెంపు వంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. అందువల్ల శిక్షణ కార్యక్రమాల నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ, ప్రతి అర్హుడైన జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం చర్యలు తీసుకుంటోంది.

వాస్తవాలను తెలుసుకోకుండా, అసంపూర్ణ సమాచారంతో ప్రచురితమయ్యే కథనాలు జర్నలిస్టులలోను అనవసరమైన అపోహలు, ఆందోళనలు కలిగించే అవకాశం ఉంది. బాధ్యతాయుతమైన మీడియా విలువలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అంశాలపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న అనంతరం వార్తను ప్రచురిస్తే దాని విశ్వసనీయ పెరుగుతుంది. జర్నలిస్టుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ప్రస్తుతం మరింత బాధ్యతాయుతంగా, వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేస్తోందని పునరుద్ఝాటిస్తున్నాం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News