- ప్రతి నెల ఒకటో తేదీ కళ్ల ప్రభుత్వం మా బిల్లులు చెల్లించాలి
- తెలంగాణ అద్దె వాహనాల అసోసియేషన్.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల చెల్లింపులను తక్షణమే పెంచి నెలకు రూ.55 వేలుగా నిర్ణయించాలని తెలంగాణ అద్దె వాహనాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేయాలని ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ దొరకక పోగా మా వాళ్లని ఇళ్లల్లోనుండి తీసుకువెళ్లి పోలీసులు అరెస్టు చేశారని అసోసియేషన్ అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ అన్నారు. ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తున్న అద్దె వాహనాల యజమానులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్స్, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ నిర్వహణ ఖర్చుల కారణంగా ప్రస్తుతం అందుతున్న చెల్లింపులతో జీవనం సాగించడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వానికి వివిధ శాఖల్లో సేవలందిస్తున్న వాహనాల యజమానులకు, డ్రైవర్లకు తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం అమలులో ఉన్న చెల్లింపులు జీవన వ్యయానికి ఏమాత్రం సరిపోవడం లేదని, అందువల్ల కనీస చెల్లింపులను రూ.55 వేలుగా నిర్ణయించాలని కోరారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన విధానం, ఇతర సౌకర్యాలను అద్దె వాహనాల డ్రైవర్లకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల మొదటి తేదీన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న విధంగానే తమకు కూడా సమయానికి బిల్లుల చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైవర్ల సంక్షేమానికి అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ అలీ, అబ్దుల్ రెహ్మాన్, జనరల్ సెక్రటరీలు మదాసు రాజు, దేవేందర్, అసోసియేషన్ ప్రతినిధులు నాగేశ్వర్ రావు, జహంగీర్ అన్సారీ అసోసియేషన్ మెంబెర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
