- పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాలకు గుడ్ బై తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలు గడువు ముగియడంతో రద్దు నిర్ణయం పర్సన్ ఇన్ చార్జ్ పాలనకు మార్పు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార వ్యవస్థలో విస్తృత సంస్కరణలకు నాంది పలికింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలుతో పాటు తొమ్మిది జిల్లాలకు చెందిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సహకార రంగంలో రాజకీయ, పరిపాలన పరంగా కొత్త దశ ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. అయితే పరిపాలనాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ఆ పాలకవర్గాలకు మరో ఆరు నెలల పొడిగింపు ఇచ్చారు.
ఆ గడువు కూడా ఆగస్టు 14తో ముగియడంతో, ప్రస్తుత ప్రభుత్వం పాలకవర్గాలను కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి రద్దు నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆర్థిక అవసరాలకు సహకార సంఘాలు ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయి. సాగు కోసం రైతులకు తక్షణంగా స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలను అందించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై సరఫరా చేయడం వంటి బాధ్యతలు ఇవే నిర్వహిస్తాయి. అలాగే ప్రభుత్వ మద్దతు ధరల కింద ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలోనూ పీఏసీఎస్ కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాలను నేరుగా రైతుల వద్దకు తీసుకెళ్లే ప్రధాన యంత్రాంగంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి.
పాలకవర్గాల రద్దుతో సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టింది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు పీఏసీఎస్, డీసీసీబీల నిర్వహణ బాధ్యతలను పర్సన్ ఇన్ చార్జ్ (%ూIజ%) కమిటీలకు లేదా ప్రభుత్వ అధికారులకు అప్పగించనుంది. ప్రత్యేకంగా తొమ్మిది జిల్లాల డీసీసీబీల బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించనుండటంతో పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిణామాలతో సహకార ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో పాటు, కొత్త జిల్లాల ప్రాతిపదికన సహకార సంస్థల పునర్వ్యవస్థీకరణ జరగవచ్చన్న చర్చ కూడా మొదలైంది. సహకార రంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
