ఒక్కవైపు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మరోవైపు రంగ శ్రీనివాస్ గౌడ్
గత వీఆర్ఓ రాజారాం చేసిన భారీ భూ స్కాం
రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి నోమా నిలయం పేరుతో అక్రమ నిర్మాణాలు
ప్రభుత్వ భూములు పరిరక్షించకుండా కబ్జాదారులకు సహకరిస్తున్న కొందరు ఉన్నతాధికారులు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్.. ఈ అక్రమ వ్యవహారాలహై చర్యలు చేపట్టే బాధ్యత మీకు లేదా?
కళ్లెదుటే రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్లు కనపడుతున్నా వీరిపై కేసులు పెట్టే బాధ్యత లేదా?
ఏసీబీ, విజిలెన్స్ అధికారులు జెర గీ అక్రమాలపై దృష్టి పెట్టండి
చెంగిచర్లలో ఒకే ఖాతా నంబర్ 28ను ఒకే ఊరిలో ఇద్దరు ఎలా క్లెయిమ్ చేస్తున్నారో జెర చూడండి
వీరి కబ్జాలకు కళ్లెం వేయాలని స్థానిక ప్రజల డిమాండ్
ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక వీఆర్ఓ చేసిన ఘనకార్యం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ ఇద్దరు కలిసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఘరానా మోసానికి తెగబడ్డారనడంలో ఎలాంటి సందేహం లేదు. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా పర్వాలకు తేరలేపారు. అసలు చట్టాలను వీళ్లు ఎలా వాడుకుంటున్నారు అన్నది పరిశీలించి చూస్తే వీరు చేస్తున్న భాగోతం బట్టబయలవుతుంది. చెంగిచర్లలో నోమా నిలయం పేరుతో విల్లాల అక్రమ నిర్మాణాలు సాగిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే(BRS Former Mla) చేసిన కబ్జా బాగోతం.. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్(Tampering of Revenue Records) చేసి భూములను అడ్డగోలుగా రాసుకున్న రంగ శ్రీనివాస్ గౌడ్(Ranga Srinivas Goud) అక్రమాలకు సంబంధించిన వ్యవహారం మీకోసం మరొక్కసారి.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండల కేంద్ర పరిధిలోని చెంగిచెర్ల గ్రామ శివారులో జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, చెంగిచెర్ల గ్రామంలో గతంలో వీఆర్వో(VRO)గా పనిచేసిన రాజారాం కుమారుడు(S/O Rajaram) రంగ శ్రీనివాస్ గౌడ్(Ranga Srinivas Goud).. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌తో చేస్తున్న కబ్జాలు చూస్తే కండ్లు బైర్లు కమ్మాల్సిందే. వివరాల్లోకెళ్తే..
ఏదైనా ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఒక గ్రామ శివారులో భూమి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఒక ఖాతా నంబర్‌లో ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో పొందపరిచి ఉంటుందని రెవెన్యూ చట్టాలు చెబుతున్నాయి. కానీ చెంగిచెర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నోమా నిలయం పేరుతో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలకు సంబంధించిన తన భూమి అని ఆధారాన్ని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy) చూపిస్తున్న ఖాతా నంబర్ 28, గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేసిన రంగ రాజారాం కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఖాతా నంబర్ 28. ఇది కళ్లెదుటే కనపడుతున్న రికార్డుల ట్యాంపరింగ్ అనేది స్పష్టమవుతుంది.
ఒకే ఖాతా నంబర్‌లోని భూమిని ఇద్దరు క్లైమ్ చేస్తూ ఒకరు ప్రభుత్వ భూములు.. మరొకరు ఇతరుల భూములను కబ్జాలు చేస్తూ వీరి అక్రమాలు మూడు పువ్వులు.. ఆరుకాయలు.. చందంగా వ్యవహరించుకుంటూ వెళ్తున్నారు. ఇదేమి చోద్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు. ఆర్వోఆర్ చట్టంలోనైనా భూభారతి చట్టంలోనైనా రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చట్టాలు చెబుతున్నా ఆ వైపు అధికారులు చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఇరువురు వ్యక్తులు చేసిన రికార్డుల ట్యాంపరింగ్‌పై నేటికీ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఏంటని మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు. గతంలో వీఆర్వోగా పనిచేసిన రాజారాం.. రెవెన్యూ రికార్డులను తగలబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. నకిలీ పట్టాలతో దర్జాగా కబ్జా చేస్తూ ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఉన్నతాధికారులు. కబ్జాదారులను కట్టడి చేయకుండా ఒకవైపు ప్రభుత్వ భూమి, మరోవైపు పేద ప్రజలకు సంబంధించిన ప్లాట్లను సైతం కబ్జాలు చేస్తూ భూదురాక్రమణలకు పాల్పడుతూ ఉంటే వారికి పరోక్ష సహకారం అందిస్తుంది కూడా ప్రభుత్వ అధికారులేనని విమర్శలు బహిరంగంగా వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవలే దబ్బికర్ భగీరత్ జీ అనే వ్యక్తి రంగ శ్రీనివాస్ గౌడ్ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి కబ్జాలు చేస్తున్న విషయంపై కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆధారాలను పరిశీలించిన కోర్టు రంగ శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అక్రమాలకు సంబంధించి సెక్షన్ 406, 468, 471, 420 ఐపీసీ రెడ్ విత్ సెక్షన్ 34 కొత్త చట్టం సెక్షన్ 316(2), 336(3), 340 మరియు 318(4) రెడ్ విత్ సెక్షన్ 3(5) పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలని మేడిపల్లి పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వీరి కబ్జాలు ముమ్మాటికి వాస్తవమేనని స్థానిక ప్రజలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఇంత భారీ భూ కుంభకోణం రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తుంటే చర్యలు చేపట్టే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. చెంగిచర్లలో వీరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి కబ్జాలు చేస్తున్న విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ఆధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం విదితమే. రంగ శ్రీనివాస్ గౌడ్, ఇతగాడి తండ్రి రాజారాం, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేస్తున్న కబ్జాలపై సృష్టించిన బోగస్ పత్రాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కళ్లెదుటే రికార్డులన ట్యాంపరింగ్ చేసినా.. నేటికీ వీరిపై అధికారులు ఒక్క కేసు పెట్టక పోవడంతో వీరు చేస్తున్న కబ్జాల్లో, రికార్డుల ట్యాంపరింగ్‌లో కొంత మంది అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరి అక్రమాలపై విచారణ జరిపి వీరు చేస్తున్న కబ్జాలకు కళ్లెం వేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రంగ శ్రీనివాస్ గౌడ్ చేసిన కబ్జాలు, చేస్తున్న అరాచకాలు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేస్తున్న కబ్జాలు, సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనాన్ని అందిస్తాం.
అదే విధంగా మేడిపల్లి మండలం, చెంగిచెర్ల గ్రామంలో రంగ శ్రీనివాస్ చేస్తున్న అక్రమాల వల్ల దాదాపు ఒక వెయ్యి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. చెంగిచెర్ల గ్రామంలో ఒక సర్వే నంబర్ కాకుండా, మరెన్నో సర్వే నంబర్లను అక్రమంగా రికార్డుల్లోకి ఎక్కించుకొని ఎంతో మందిని ఇబ్బందిపెడుతున్నారు. ఈయన పోలీసులను తన చుట్టాల్లా భావిస్తాడు… న్యాయస్థానాలను మేనేజ్ చేస్తాడు. రాజకీయ నాయకులను డోంట్ కేర్ అంటుంటాడు. ఇక అక్రమంగా రికార్డుల్లో ఎక్కించుకున్న భూములను చూపించి ఎంతో మంది దగ్గర కోట్లల్లో డబ్బులు తీసుకుంటాడు.
ఈయనకు ఐటీ డిపార్ట్‌మెంట్ అంటే లెక్క లేదు. ఎందుకంటారా ఈయన దగ్గర అంతా జీరో మనీయే ఉంటుంది. ఈయనపై ఎన్నో పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. ఈయనకు సామాన్యులంటే అసలు లెక్కలేదు. ఇతనికి సంబంధించిన అవినీతి వ్యవహారాలపై మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్. “మా అక్షరం అవినీతిపై అస్త్రం”.
