- నరకప్రాయంగా తాడ్వాయి కస్తూర్బా పాఠశాల దారి..
మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు వెళ్లే దారి “చినుకు పడితే చిత్తడే ” అదేవిధంగా తయారవుతుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో వర్షం పడితే చాలు మెయిన్ రోడ్డు నుంచి కస్తూర్బా పాఠశాలకు వెళ్లే దారి మొత్తం బురదమయంగా తయారై నడవడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉంటుందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడ్డప్పుడు పాఠశాలకు తెచ్చే నిత్యవసర వస్తువులు,కూరగాయలు, పాలు, గ్యాస్,తదితర వస్తువులు కూడా మెయిన్ రోడ్డు నుంచి పాఠశాల వరకు మోసుకెళ్ళవలసి వస్తుందని, పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చందాపూర్ రోడ్డు నుండి కస్తూర్బా పాఠశాల వరకు రోడ్డు వేయాలని పలుమార్లు నివేదికలు పంపినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. సుమారు 500 మీటర్ల వరకు బురుదలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని, తమ పిల్లలు చూడడానికి వెళ్తే తమకు సైతం బురద కష్టాలు తప్పడం లేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు బాగా పడ్డప్పుడు పాఠశాలలోని ప్రాంగణం మొత్తం బుడగమయంగా తయారై జారుతుందని ప్రాంగణంలో నడవడానికి ఏమాత్రం వీలు లేకుండా పోతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ పాఠశాలకు రోడ్డు వేయించి, పాఠశాల ప్రాంగణం మొరంతో నింపాలని ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు కోరుచున్నారు.
