- నష్టపరిహారం చెల్లించాలంటూ తాడ్వాయి రైతుల డిమాండ్ …!
తాడ్వాయి: నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల రైతులు(Tadwai Farmers) శనివారం పత్రిక సమావేశం నిర్వహించారు. వ్యాపారి మాయమాటలు నమ్మి నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో తాము ఆర్థికంగా రోడ్డున నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…
తాడ్వాయి మండలంలోని దేమీకలన్ గ్రామానికి చెందిన దుడక గంగయ్య ఫర్టిలైజర్ దుకాణంలో నాణ్యమైన విత్తనాలంటూ (కమిట్మెంట్ పై )వ్యాపారి ఇచ్చిన హామీని నమ్మి పలువురు రైతులు రాజనాల బీర్నిస్ విత్తనాలు కొనుగోలు చేశారు. తాడ్వాయి, చందాపూర్, బ్రహ్మాజీవాడి, కృష్ణాజివాడి, దేమేకలాన్, కన్కల్, కరడపల్లి తదితర గ్రామాల పరిధిలోని సుమారు 60 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేశారు.
ఇందులో ప్రధానంగా వెల్మ సంతోష్ రెడ్డి (3 ఎకరాలు), బండారి రాజు (3 ఎకరాలు), మర్రి మోహన్ (3 ఎకరాలు), పని గంగారాం (2 ఎకరాలు), నడిపి మర్రి మోహన్ (3 ఎకరం), మర్రి సాయిలు (3 ఎకరాలు), మర్రి వీరయ్య (1 ఎకరం), మర్రి శ్రీను (1 ఎకరం), దేమీ నవీన్ (1 ఎకరం)తో పాటు రామస్వామి, తిరుపతి తో పాటు మరికొంత మంది రైతులు పెట్టుబడులు పెట్టి సాగు చేపట్టారు.
మొలకెత్తని పంట.. వ్యాపారి నిర్లక్ష్యం
విత్తనాలు నాటి రోజులు గడుస్తున్నా విత్తనలు మొలకెత్తకపోవడంతో విత్తనాలు నాసిరకం, నకిలీవని తేలింది. సాగు కోసం ఎకరానికి రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యామని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై వ్యాపారి దుడక గంగయ్యను నిలదీస్తే బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోయారు.
అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణ.. ధర్నా చేస్తామని రైతుల హెచ్చరిక ..
లక్షలాది రూపాయలు నష్టపోయి తాము కన్నీరుమున్నీరవుతున్నా, వ్యవసాయ శాఖ అధికారులకు ఈ విషయాలు తెలిసిన పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. వ్యాపారితో అధికారులు కుమ్మక్కై చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నాసిరకం విత్తనాలు అమ్మిన వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మోసపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే మండల రైతులమంతా ఏకమై రోడ్డెక్కి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
