ఇండియా పర్యటనకు వచ్చిన శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య.. మన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. హరిణి అమరసూర్యను స్వాగతించడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. విద్య, మహిళా సాధికారత, ఆవిష్కరణ, అభివృద్ధి సహకారం, మత్స్యకారుల సంక్షేమం వంటి విస్తృత రంగాలపై ఆమెతో చర్చలు జరిపారు. పొరుగు దేశాలుగా ఇండియా, శ్రీలంక పరస్పర సహకారం అందించుకుంటామని, ప్రజల శ్రేయస్సు, ఉమ్మడి ప్రాంత ప్రయోజనాల కోసం ఇదెంతో అవసరమని తెలిపారు.

హరిణి అమరసూర్య పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన శ్రీలంక పర్యటనను, ఆ దేశ అధ్యక్షుడు దిసనాయకేతో ఫలవంతమైన చర్చలనూ గుర్తుచేసుకున్నారు. విద్య, సాంకేతికత, ఆవిష్కరణల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంలో సహకారాన్ని బలోపేతం చేసే చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల సమష్టి అభివృద్ధి ప్రయాణంలో కలిసి పనిచేయడం పట్ల భారత నిబద్ధతను పునరుద్ఘాటించారు.

