- మరో గ్రహం ప్రభావం వల్లే ఇది జరిగింది..TOI-2535b
- దృష్టిపథం నుంచి పక్కకు జరిగిందని వెల్లడి..TOI-2535b
అంతరిక్షంలో అకస్మాత్తుగా అదృశ్యమై ఖగోళ శాస్త్రవేత్తలను తీవ్ర విస్మయానికి గురిచేసిన భారీ గ్రహం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. భూమికి దాదాపు 1,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న (TOI-2535b ) ‘టీవోఐ-2535 బి’ అనే రాక్షస వాయు గ్రహం అంతరిక్షం నుంచి ఎక్కడికీ కొట్టుకుపోలేదని, పక్కనే ఉన్న మరో గ్రహం ప్రభావం వల్లే మన దృష్టిపథం నుంచి పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
నాసాకు చెందిన ‘టెస్’ స్పేస్ టెలిస్కోప్ ద్వారా దాదాపు ఏడేళ్ల పాటు ఈ గ్రహాన్ని పరిశోధకులు నిరంతరం పరిశీలించారు. సాధారణంగా ఒక గ్రహం తన నక్షత్రం ముందు నుంచి వెళ్లే ప్రక్రియను ‘ట్రాన్సిట్’ అంటారు. టీవోఐ-2535 బి గ్రహం ప్రతి 8.25 రోజులకు ఒకసారి తన మాతృ నక్షత్రం చుట్టూ తిరుగుతూ, ట్రాన్సిట్ సమయంలో టెలిస్కోప్లకు స్పష్టంగా కనిపించేది. అయితే, కొద్దికాలంగా దీని ట్రాన్సిట్ సమయాల్లో ఊహించని మార్పులు కనిపించాయి. కొన్నిసార్లు గంటల ముందే రావడం, మరికొన్నిసార్లు ఆలస్యంగా వెళ్లడం, క్రమంగా దాని కాంతి క్షీణించడం జరిగింది. చివరికి ఈ ఏడాది ప్రారంభంలో ఆ గ్రహం టెలిస్కోప్ కంటికి పూర్తిగా కనిపించకుండా పోయింది.
సాధారణంగా గ్రహాల కక్ష్యల్లో మార్పులు రావడానికి దశాబ్దాలు లేదా శతాబ్దాలు పడుతుంది. కానీ ఇంత తక్కువ సమయంలో ఒక గ్రహం కళ్ల ముందే మాయమవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామంపై విస్తృతంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అసలు నిజాన్ని కనిపెట్టారు. ఆ నక్షత్ర వ్యవస్థలో టీవోఐ-2535 బి గ్రహంతో పాటు కంటికి కనిపించని మరో గ్రహం కూడా ఉందని గుర్తించారు. ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న బలమైన గురుత్వాకర్షణ శక్తుల కారణంగా వాటి కక్ష్యలు బొంగరంలా గిరగిరా తిరుగుతూ తీవ్రంగా వాలిపోయాయి. ఫలితంగా, టీవోఐ-2535 బి కక్ష్య భూమి నుంచి కనిపించే దృష్టిపథానికి దూరంగా కాస్త పైకి లేదా కిందికి వంగిపోయింది. ఆ గ్రహం ఇప్పటికీ తన నక్షత్రం చుట్టూ తిరుగుతున్నప్పటికీ, భూమి కోణంలో అది నక్షత్రానికి అడ్డుగా రావడం లేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
