Homeరంగారెడ్డిShankarpally | రోడ్డు తవ్వితే రూ.10 వేల జరిమానా.. మరి అక్రమ నిర్మాణాలకు ఫైన్ ఎంత?

Shankarpally | రోడ్డు తవ్వితే రూ.10 వేల జరిమానా.. మరి అక్రమ నిర్మాణాలకు ఫైన్ ఎంత?

  • మున్సిపాలిటీలో నిబంధనలు సామాన్యులకేనా..?
  • జీవో111 పరిధిలో యథేచ్ఛగా నిర్మాణాలు.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాలిటీలో(Shankarpally Municipality) అధికారుల జరిమానాల విధానంపై ఇప్పుడు చర్చ మొదలైంది.రెడ్డి కాలనీలో అనుమతి లేకుండా రోడ్డును తవ్వినందుకు రూ10 వేల జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు,మరి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఎంత జరిమానా విధిస్తున్నారు?అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.రోడ్డు తవ్వితే వెంటనే స్పందించే యంత్రాంగం,మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న నిర్మాణాల విషయంలో అదే వేగం ఎందుకు చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా జీవో111పరిధిలోని ప్రాంతాల్లో భూముల వినియోగం, నిర్మాణాల అనుమతులు, పర్యావరణ పరిరక్షణ అంశాలు అత్యంత కీలకమైనవి.

ఉస్మాన్‌సాగర్,హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలు చట్టబద్ధమైన అనుమతులు,వర్తించే ప్రభుత్వ ఉత్తర్వులు, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత ఉంది.అయితే శంకర్‌పల్లి మున్సిపాలిటీ(Shankarpally Municipality) పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూములు,ఫామ్‌హౌస్‌లు,లేఅవుట్లు,ఇతర నిర్మాణాల పేరుతో అనుమతులకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారా?అనుమతులు ఉన్నాయా?నిర్మాణాలకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం పరిశీలన చేసిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

రోడ్డు తవ్వకానికి జరిమానా..అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అనుమతి లేకుండా రోడ్డు తవ్వితే రూ10 వేల జరిమానా విధించడం స్వాగతించదగిన చర్యే.అయితే అదే క్రమశిక్షణ మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల విషయంలోనూ కనిపించాలి కదా?నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నోటీసులు జారీ చేయడం,పనులు నిలిపివేయించడం,చట్టప్రకారం జరిమానాలు విధించడం, అవసరమైన చోట కూల్చివేత చర్యలు చేపట్టడం వంటి చర్యలు ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మున్సిపల్ అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణాల అనుమతులు,భూ వినియోగ మార్పులు, లేఅవుట్ అనుమతులు,సంబంధిత శాఖల క్లియరెన్సులను తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది.జీవో111 నిబంధనలు వర్తించే ప్రాంతాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సంబంధిత చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించాలి!

రోడ్డు తవ్విన సామాన్యుడికి జరిమానా విధించినట్లే,నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్న వారిపైనా చట్టం సమానంగా అమలు కావాలని ప్రజలు కోరుతున్నారు.మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు? ఎన్ని నోటీసులు జారీ చేశారు?ఎన్ని నిర్మాణాలపై పనులు నిలిపివేశారు?ఎంతమందికి జరిమానాలు విధించారు?అనే వివరాలను అధికారులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చట్టం అందరికీ ఒకటేనా? లేక సామాన్యులకే పరిమితమా? అన్న ప్రశ్నకు శంకర్‌పల్లి మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జీవో111 పరిధితో పాటు మున్సిపల్ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News