- రెవెన్యూ విభాగం పరిపాలనలో మాత్రం 40 ఏళ్ల నాటి వ్యవస్థ!
- శేరిలింగంపల్లి మండల విభజనకు మోక్షం ఎప్పుడు?
- రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం అందించే శేరిలింగంపల్లి మండలం …
- లక్షల కోట్ల విలువైన భూములు… కానీ ఇప్పటికీ ఒకే మండలం….!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన శేరిలింగంపల్లి మండలం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా నిలిచిన ప్రాంతం ఏదైనా ఉందంటే అందులో ప్రధమ స్థానం శేరిలింగంపల్లి మండలమే. ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు, అంతర్జాతీయ వ్యాపార కేంద్రాలు, బహుళజాతి కంపెనీలు, అత్యంత ఖరీదైన నివాస, వాణిజ్య ప్రాజెక్టులు, దేశంలోనే అత్యధిక విలువైన భూములు, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు… ఇవన్నీ ఒకే మండల పరిధిలో ఉండటం శేరిలింగంపల్లి ప్రత్యేకత …
నేడు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాంతం. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడా, కొండాపూర్, మాధాపూర్ వంటి అంతర్జాతీయ స్థాయి వ్యాపార కేంద్రాలు ఈ మండల పరిధిలోనే ఉన్నాయి. దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీలు, కోట్లాది రూపాయల వాణిజ్య సముదాయాలు ఇక్కడే వెలసాయి. అయితే, అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మండలం పరిపాలనా పరంగా మాత్రం 1985 తరువాత దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన మండలంతోనే కొనసాగుతుండటం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
ఆదాయం అందించే మండలం… కానీ పరిపాలన మాత్రం 40 ఏళ్ల నాటి వ్యవస్థతోనే!
1985లో మండల వ్యవస్థ… అప్పుడే శేరిలింగంపల్లి మండలం ఆవిర్భావం
1985 మే 25న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాయకత్వంలోని ప్రభుత్వం తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామాలను, కలుపుతూ శేరిలింగంపల్లి మండలం ఏర్పాటు చేయబడింది. ఆ సమయంలో ఈ ప్రాంతం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ప్రస్తుతం ఉన్న శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం 2008 డిలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. అప్పటి నుంచి నేటి వరకు ఈ మండలం పరిపాలనా పరంగా విభజన లేకుండానే కొనసాగుతోంది.

శేరిలింగంపల్లి మండలం పరిధిలో ఉన్న ప్రధాన రెవెన్యూ గ్రామాలు :
శేరిలింగంపల్లి, గోపన్ పల్లి, నల్లగండ్ల, మియాపూర్, మక్తా మహబూబ్ పేట్, మదీనగూడ, హఫీజ్ పేట్, కొండాపూర్, కొత్తగూడ, ఖానామెట్, మాధాపూర్, గుట్టల బేగంపేట్, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడా, ఖాజాగూడ, చందానగర్, ఇజ్జత్ నగర్, రామన్నగూడ, రాయదుర్గం..
ఈ ప్రాంతాల్లో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడా, మాధాపూర్ వంటి ప్రాంతాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా ఎదిగాయి.
40 ఏళ్లలో శేరిలింగంపల్లి మండలం ప్రపంచ స్థాయి అభివృద్ధి…
కానీ పరిపాలన మాత్రం యథాతథం :
శేరిలింగంపల్లి మండలం పరిధిలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలు దేశవ్యాప్తంగా అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. భూముల విలువ… ఊహకందని స్థాయిలో ఉన్నాయి.
ఈ మండల పరిధిలోని అనేక ప్రాంతాల్లో :
- గజం ధర లక్ష రూపాయలు దాటిన వాణిజ్య భూములు ఉన్నాయి.
- ఎకరం భూమి విలువ వందల కోట్ల రూపాయలకు చేరిన ప్రాంతాలు ఉన్నాయి.
- ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, యూఎల్సీ భూములు, చెరువులు, శిఖం భూములు, వివాదాస్పద భూములు భారీ స్థాయిలో ఉన్నాయి.
- రాష్ట్రంలోనే అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్లో గణనీయమైన భాగం ఈ మండల పరిధిలోనే ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రభుత్వ భూముల విలువ లక్షల, కోట్ల రూపాయలకు చేరుతుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలు ,పెద్ద మండలాలకు విభజన…
శేరిలింగంపల్లికి మాత్రం ఎందుకు కాదు? :
2016లో తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించింది విభజన చేసింది … మరి శేరిలింగంపల్లి మండలం ఎందుకు కాలేదు ..?
ఆ సమయంలో :
- రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్, గండిపేట్, శంషాబాద్ మూడు మండలాలుగా..
- బాలానగర్ : బాలానగర్, కూకట్ పల్లి రెండు మండలాలుగా..
- కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్, బాచుపల్లి, దుండిగల్ – గండిమైసమ్మ మూడు మండలాలుగా..
- పఠాన్ చెరు : పఠాన్ చెరు, అమీన్ పూర్, గుమ్మడిదల, జిన్నారం నాలుగు మండలాలుగా..
- మేడ్చల్ : మేడ్చల్, శామీర్పేట్, మూడుచింతలపల్లి మూడు మండలాలుగా..
- ఉప్పల్ : ఉప్పల్, ఘట్కేసర్ రెండు మండలాలుగా..
- హయత్ నగర్ : హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ రెండు మండలాలుగా..
- ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం మూడు మండలాలుగా..
- చేవెళ్ల : చేవెళ్ల, మొయినాబాద్ రెండు మండలాలుగా..
- మహేశ్వరం : మహేశ్వరం, కందుకూరు రెండు మండలాలుగా..
అయితే శేరిలింగంపల్లి మాత్రం యథాతథంగా కొనసాగింది.
ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలు :
- రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన మండలం, అత్యధిక జనాభా ఉన్న మండలాల్లో ఒకటైన శేరిలింగంపల్లిని ఇంకా ఎందుకు విభజించలేదు?
- జనాభా, విస్తీర్ణం, రెవెన్యూ భారం దృష్ట్యా కొత్త మండలాల అవసరం లేదా?
- వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల నిర్వహణకు ప్రస్తుత వ్యవస్థ సరిపోతుందా? ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ అవసరం కాదా?
- భూ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ యంత్రాంగం అవసరం కాదా? భారీ భూ వివాదాలను ఒకే మండల కార్యాలయం సమర్థవంతంగా నిర్వహించగలదా?
- ప్రజల అవసరాల దృష్ట్యా పరిపాలనా వికేంద్రీకరణపై ప్రభుత్వం పునరాలోచిస్తుందా?
- ఇంత పెద్ద మండలానికి పూర్తి స్థాయి సిబ్బంది ఎందుకు లేరు?
- ప్రస్తుతం సహితం పూర్తి స్థాయి సర్వేయర్ లేకపోవడం పరిపాలనపై ప్రభావం చూపడం లేదా?
మరిన్ని ఆసక్తికర అంశాలు మరో కథనం ద్వారా అందించనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’
