- లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటీఐ) మంచిర్యాల జిల్లా మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో జూట్ బ్యాగుల తయారీపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి అన్నారు. బుధవారం ఆర్‌సెటీఐ మంచిర్యాల లో ఏర్పాటు చేసిన 14 రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా వయోజన విద్యా కార్యక్రమ అధికారి శ్రీనివాస్, ఆర్‌సెటీఐ సంచాలకులు ఆశిష్ వార్లే, కార్మల్ పాఠశాల ప్రిన్సిపల్ సారూప్య లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జూట్ ఉత్పత్తుల రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, ఆర్‌సెటీఐ ప్రత్యేక శిక్షకుల ద్వారా జూట్ బ్యాగుల తయారీకి సంబంధించిన సాంకేతిక అంశాలు, నాణ్యత ప్రమాణాలు, ముడి పదార్థాల ఎంపిక, ఉత్పత్తి ప్రక్రియ తదితర అంశాలపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, మార్కెటింగ్ టెక్నిక్స్, వ్యాపార నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, ఇతర నైపుణ్యాభివృద్ధి అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తైన అనంతరం స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు, అర్హులైన వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించి ఆర్థిక అభివృద్ధికి సహకరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
