- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు.మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల నుండి కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఒకరోజులో కనీసం 10 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల తహసిల్దార్ వనజా రెడ్డి తో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి త్వరగా మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రైతు వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని, రైతు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
