- మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇరాన్ తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్ జలసంధి ని తిరిగి తెరిపించే విషయంలో నాటో కూటమి నుంచి ఎలాంటి సాయం అందకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ కూటమిపై ఇప్పటికే అనేకసార్లు విరుచుకుపడిన ఆయన.. తాజాగా మరోసారి ట్రూత్ సోషల్ వేదికగా విమర్శలు చేశారు. నాటో అమెరికాకు ఎప్పుడూ మద్దతుగా నిలువలేదని మండిపడ్డారు.
అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ నాటో కూటమి అండగా లేదని, భవిష్యత్తులోనూ దాని నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దృష్టిలో నాటో కూటమి గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదని అసహనం వ్యక్తంచేశారు. కాగా గత కొన్నిరోజులుగా నాటోపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా నాటో కూటమిని ఒక కాగితపు పులిగా అభివర్ణించారు. కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.
మరోవైపు అమెరికాలో జన్మించిన తొలి పోప్ లియో-14, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య జగడం మరింత ముదురుతోంది. పోప్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ మంగళవారం ఓ పోస్టు పెట్టారు. గత రెండు నెలల్లో ఇరాన్ దాదాపు 42 వేల మంది అమాయకులైన నిరసనకారులను బలిగొన్నదని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండటం సరైనది కాదని ఉద్ఘాటించారు. ఈ విషయం పోప్ లియోకు అర్థమయ్యేలా ఎవరైనా చెప్పాలంటూ ఎద్దేవా చేశారు.
