Saturday, October 4, 2025
ePaper
Homeరాజకీయంఆపరేషన్ సిందూర్‌పై రాజకీయం

ఆపరేషన్ సిందూర్‌పై రాజకీయం

ఆపరేషన్ సిందూర్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌లో మనదే పైచేయి అని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుంటే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒప్పుకోవట్లేదు. ప్రధాని మోదీ వైపు వేలెత్తి చూపుతున్నారు. ట్రంప్‌‌కు భయపడి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని విమర్శించారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్‌ గాంధీ పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారని మండిపడుతోంది.

ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై తక్షణం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ఇండియా కూటమి కోరుతోంది. ఆపరేషన్‌ సింధూర్‌పై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ఇండియాపై రెండు రోజుల్లో సక్సెస్ సాధిస్తామని పాకిస్తాన్‌ పగటి కలలు కనగా 8 గంటల్లోనే మనకు లొంగిపోయేలా సైన్యం బుద్ది చెప్పిందని అన్నారు. దీంతో చేసేదేంలేక ఆ దేశమే కాల్పుల విరమణకు ముందుకొచ్చిందని స్పష్టం చేశారు.

కానీ.. రాహుల్ గాంధీ కామెంట్స్ వేరేలా ఉన్నాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971 యుద్దంలో ఎవరికి భయపడలేదని, స్వాతంత్ర్య కాలం నాటి నుంచి సరెండర్‌ కావడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు అలవాటేనని ఎద్దేవా చేశారు‌. ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ ఆపరేషన్‌ సింధూర్‌పై రాహుల్‌ గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయింది. ట్రంప్ అడిగితే కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షలు డిమాండ్ చేస్తే పార్లమెంట్ సమావేశాలను ఎందుకు ఏర్పాటుచేయట్లేదని శివసేన ఉద్దవ్‌ వర్గం ఎంపీ సంజయ్‌ రౌత్ నిలదీశారు.

ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌, ఆర్జేడీ ఎంపీలు కూడా కోరారు. ప్రధాని మోదీకి రాసిన లేఖపై 200 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. అయితే.. ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం ఇండియా కూటమి ఎంపీల భేటీకి రాలేదు. కానీ.. ప్రధాని మోదీకి విడిగా లెటర్ పంపుతోంది. ఈ విషయంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) కూడా ఇండియా కూటమికి సపోర్ట్ చేయట్లేదు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News