2021లో నిమోనియా వ్యాధితో 2.2 మిలియన్ల మంది మరణించగా అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఐదేళ్లలోపు వయసు ఉన్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి నిమోనియా. కోవిడ్-19 (Covid) కారణంతో మరో 10 మిలియన్ల మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ మందిని బలిగొంటున్న వ్యాధుల్లో నిమోనియా ప్రధానమైందని తేలింది.
వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం (Air Pollution) కోరలు చాచడంతో శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తుల (Lungs) సమస్యలు ఉత్పన్నం కావడం, నిమోనియా మహా విపత్తు వస్తుందనే భయం కూడా ఉందని, మిలియన్ల మంది నిమోనియా సోకే ప్రమాదపు అంచున ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధి ఐదేండ్లలోపు పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. టీకాలు (Vaccines) వేయించుకోనివారు, పోషకాహార లోపాలు, ఇంట్లో వంట చెరుకు వాడే వారు, కలుషిత గాలి పీల్చే పెద్ధలు, పొర తాగే అలవాటు ఉన్నవారు అధికంగా దీని బారిన పడే ప్రమాదం ఉంటుంది.
2025 థీమ్
నిమోనియా వ్యాధి తీవ్రత, ప్రమాదాన్ని గుర్తించిన అంతర్జాతీయ సమాజం 2009 నుంచి ఏటా నవంబర్ 12న ప్రపంచ నిమోనియా దినం పాటిస్తూ ఆ వ్యాప్తి పట్ల కనీస అవగాహన కల్పిస్తోంది. బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగీ సంక్రమణ వల్ల శ్వాస రుగ్మత (ఇన్‌ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిసార్డర్) లేదా నిమోనియా వ్యాధి అంటుకుంటుంది.
ఈ సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లో చేరి ఎల్వియోలి అనే భాగంపై ప్రభావం చూపి నిమోనియాకు దారి తీస్తాయి. దీనివల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలు, వృద్ధులకు నిమోనియా సోకి ప్రాణాంతకంగా మారొచ్చు. ప్రపంచ నిమోనియా దినం-2025 థీమ్.. ‘పిల్లల మనుగడ (చైల్డ్ సర్వైవల్)’.
న్యుమోనియాలో రకాలు:
నిమోనియా నివారించదగ్గ అంటువ్యాధి(Infection). వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం లాంటి సందర్భాల్లో మరొకరికి సంక్రమిస్తుంది. పిల్లల్లో బ్యాక్టీరియా కారణ స్ట్రెప్టోకోకల్ నిమోనియా అతి ప్రధానమైంది. దాని తర్వాత హీమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా రెండో ప్రధానమైంది. నిమోనియాలో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వ్యాధి వైరస్ వర్గంలో ముఖ్యమైంది.
నిమోనియాకి చికిత్స కూడా అందుబాటులో ఉంది. ప్రభుత్వాలు, వైద్యారోగ్య శాఖ, ఎన్‌జిఓలు, ఇతర సంస్థలు కలిసి నిమోనియా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, చికిత్సా పద్దతులు వివరించడం మంచి ఫలితాలను ఇస్తాయి. నిమోనియాని తొలి దశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం ముఖ్యం.
కారణాలు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) వివరాల ప్రకారం ఏటా 14 లక్షల మంది పిల్లలు నిమోనియా సోకి చనిపోవడం, పిల్లల మరణాల్లో 18 శాతం వరకు ఇది కారణం కావడం గమనార్హం. యూనిసెఫ్ (Unicef) వివరాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు నిమోనియాతో మరణిస్తున్నాడు. వృద్ధుల్లో న్యుమోకోకల్ నిమోనియా అధికంగా సోకుతుంది. న్యుమోసిస్టిక్ జిరోవెస్సీ వ్యాధి ఫంగస్ సోకడంతో వస్తుంది.
గాలి కాలుష్యం, స్మోకింగ్ (Smoking) వల్ల 16 లక్షల మంది వృద్ధులు మరణిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఒ, యూనిసెఫ్‌లు సంయుక్తంగా నిమోనియా, డయేరియా వ్యాధుల కట్టడికి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులు, పర్యావరణ కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, హెచ్ఐవి/క్యాన్సర్ లాంటివి సోకిన వ్యాధిగ్రస్థులు నిమోనియా ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ.
నివారణ మార్గాలు:
టీకాలు వేయించడం, పోషకాహారం అందించడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల నిమోనియా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఔషధాలతో నిమోనియా కట్టడి జరుగుతుంది. భౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం, పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా ఉండడం, దగ్గినపుడు లేదా తుమ్మినపుడు కండువా కప్పుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడం, నదులు కలుషితం కాకుండా చూసుకోవడం లాంటి పలు జాగ్రత్తలు నిమోనియా కేసులను తగ్గిస్తాయి.
పిల్లలకు, పెద్దలకు అతి ప్రమాదకరమైన అంటు వ్యాధిగా నిలిచిన నిమోనియా పట్ల సరైన అవగాహన పెంచుకొని అలాంటి ప్రాణాంతక రుగ్మతకు చరమగీతం పాడదాం, నిమోనియా కానరాని భారతాన్ని నిర్మించుకుందాం.
(నవంబర్ 12: ప్రపంచ నిమోనియా దినం సందర్భంగా)
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

