- దుష్టశిక్షణ కోసమే ఈ అవతారం..
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరశురామావతారం కూడా ఒకటి. పరశురాముడు శ్రీమహావిష్ణువు ఆరో అవతారం అని చెబుతారు. పరశు అంటే గొడ్డలి. పరశురాముడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి శివుని నుంచి అఖండ గొడ్డలిని వరంగా పొంది, దుష్టశిక్షణ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని గురించి కొన్ని విశేషాలు
పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు, ప్రదోష కాలంలో జన్మించాడని స్కాంద, బ్రహ్మాండ పురాణాలు పేర్కొన్నాయి. ఇదే రోజు అక్షయ తృతీయ కూడా కావడం విశేషం. అయితే ఈ ఏడాది వైశాఖ శుద్ధ తదియ ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 1:27 నిమిషాల నుంచి మరుసటి రోజు ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 11:05 వరకు ఉంది.
అయితే పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రదోషం వేళలో అంటే సాయంత్రం సమయంలో జన్మించినందున ఈ ఏడాది పరశురామ జయంతి ఏప్రిల్ 19, ఆదివారం రోజునే జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా ఈ పండుగ అక్షయ తృతీయతో కలిసి వస్తుంది. కానీ ఈసారి అక్షయ తృతీయ రోజు సాయంత్రం తదియ తిథి లేనందున ఏప్రిల్ 19, ఆదివారం రోజునే పరశురామ జయంతి అని పండితులు చెబుతున్నారు.
హిందూ పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమే పరశురాముడు. స్కాంద, బ్రహ్మండ పురాణాల ప్రకారం, పరశురామ అంటే పరశును ధరించిన రాముడని అర్ధం. పరశురాముని ఆయుధం గొడ్డలి. జమదగ్ని మహర్షి, రేణుకల వరపుత్రుడు పరశురాముడు. తన తండ్రిని అవమానించారన్న కోపంతో క్షత్రియ వంశాలను సమూలంగా నాశనం చేసిన పరశురాముని ఒకింత కోపం ఎక్కువే అని అంటారు. కానీ ఈ కోపం కూడా లోక కల్యాణానికి ఉపయోగపడింది. సమాజాన్ని రక్షించే బాధ్యత మరచిన క్షత్రియ సమాజంలో అహంకారపూరిత రాజులను మాత్రమే ఆయన ఓడించాడు.
శ్రీ వాల్మీకి రామాయణం ప్రకారం స్వయంవరంలో సీతాదేవిని వరించిన శ్రీరాముడు కల్యాణరాముడై అయోధ్యకు తరలి వెళ్లే సందర్భంలో తొలిసారి శ్రీరామునికి పరశురాముడు ఎదురవుతాడు. ఇలా ఒకేసారి శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలు ఎదురు పడడం అరుదైన సందర్భం. స్కంద పురాణం ప్రకారం దుష్టులను శిక్షించేందుకు, అమాయకులను రక్షించేందుకు పరశురాముడు అవతరించాడు. ఈ క్రమంలో ఆయన ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
తన తండ్రి ఆదేశం మేరకు కన్న తల్లినే సంహరించి, తిరిగి తండ్రి నుంచి వరం పొంది ఆ వర ప్రభావంతో తన తల్లిని తిరిగి బ్రతికించుకున్న ధీరుడు. లక్ష్మీ దేవి అవతారమైన ధనవిని వివాహం చేసుకున్నాడు. మన పురాణాలు పేర్కొన్న సప్తచిరంజీవుల్లో పరశురాముడు కూడా ఒకడు. ఇప్పటికీ ఈయన భూమిపై సజీవంగా, చిరంజీవిగా తిరుగాడుతున్నాడని విశ్వాసం. మహాభారతం ప్రకారం పరశురాముడు భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణులకు గురువు కూడా వ్యవహరించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది.
