జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ (WhatsApp Grievance) సెల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం ప్రతిసారీ కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ డిజిటల్ వేదికను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ 8317557897కు మెసేజ్ రూపంలో పంపవచ్చని తెలిపారు. ఫిర్యాదుతో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలు పంపించాలని సూచించారు.
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును ప్రత్యేక బృందం నమోదు చేసి, వెంటనే సంబంధిత శాఖాధికారులకు పంపిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్ణీత కాలపరిమితిలో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లా ప్రజలు ఈ వాట్సాప్ గ్రీవెన్స్ (WhatsApp Grievance) సెల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ఈ నంబర్‌కు పంపించాలని, అనవసరమైన లేదా తప్పుడు సందేశాలను పంపవద్దని సూచించారు. 8317557897 నంబర్‌ను కేవలం వాట్సాప్ సేవల కోసం మాత్రమే వినియోగించాలని, ఈ నంబర్‌కు ఫోన్ కాల్స్ చేయరాదని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
