- 9 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు..
- భక్తులకు అన్నప్రసాద వితరణ
- ఆలయ అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి
నిర్మల్ పట్టణ శివారులోని గండి రామన్న క్షేత్రం సమీపంలో కొలువుదీరిన నందిగుండం దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలకు (Navratri Celebrations) సర్వం సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించనున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టడంతో పాటు, ఈ నెల 18న కన్యా పూజలు, 20న విజయదశమి వేడుకలను నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్రెడ్డి ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న ఉదయం 5.30 గంటలకు ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి నేతృత్వంలో మాలధారణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాలధారణ స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నవరాత్రి ఉత్సవాల్లో (Navratri Celebrations) భాగంగా ప్రతిరోజూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
11న శ్రీబాలా త్రిపురసుందరి అమ్మవారి పూజతో ఉత్సవాలు ప్రారంభమై, 12న శ్రీ గాయత్రీ దేవి, 13న శ్రీ మంగళగౌరి దేవి, 14న శ్రీ అన్నపూర్ణాదేవి, 15న శ్రీ దేవి లలితాంబ, 16న శ్రీ సరస్వతీ దేవి, 17న శ్రీ మహాలక్ష్మీ దేవి, 18న శ్రీ మహిషాసురమర్దిని, 19న శ్రీ దుర్గాదేవి, 20న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు వివరించారు. ప్రతి రోజూ విశేష అలంకరణలు, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో (Navratri Celebrations) భాగంగా ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి కన్యా పూజలు నిర్వహించనున్నట్లు జగన్మోహన్రెడ్డి వెల్లడించారు.
అదే రోజు రాత్రి 7.45 గంటలకు నిర్వహించే మహిషాసుర దహనం కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని 20వ తేదీన బంగారు రథోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ నెల 25న ఆదివారం దుర్గామాత విగ్రహ సామూహిక నిమజ్జనం అనంతరం బహుమతుల ప్రదాన కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
నవరాత్రుల (Navratri Celebrations) సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతిరోజూ ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. భక్తులు రూ.11,000 చెల్లించి శాశ్వత అన్నదాతలుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, ఇతర వివరాల కోసం కింది నెంబర్ ను 9640276496 సంప్రదించాలని సూచించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పోలిశెట్టి విలాస్, సాదం ఆనంద్, పూదరి జనార్ధన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
