- గ్రాంట్లు ఖర్చు చేయకముందే బిల్లులు పెట్టాలట.
- వ్యాపారుల ఖాతాల్లోకే నిధులు.. హెచ్ఎంలకు కొత్త తిప్పలు ?
- ఆందోళన వ్యక్తం చేస్తున్న 44 వేల ప్రభుత్వ పాఠశాలలు ?
- గడువులోగా బిల్లులు ఇవ్వకుంటే గ్రాంట్లు వెనక్కిపంపుతారట .?
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు(Government Schools) కేటాయించే గ్రాంట్ల వినియోగం ఇప్పుడు ప్రధానోపాధ్యాయులకు కొత్త తలనొప్పిగా మారింది. పాఠశాలల అవసరాల కోసం ఇచ్చే నిధులను ఖర్చు చేసిన తర్వాత బిల్లులు సమర్పించడం సాధారణ పద్ధతి. అయితే, ఇకపై చేయబోయే ఖర్చులకు కూడా ముందుగానే బిల్లులు సమర్పించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించడంపై హెచ్ఎంలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బిల్లుల మొత్తాన్ని నేరుగా వస్తువులు సరఫరా చేసే వ్యాపారుల ఖాతాల్లోనే జమ చేస్తామని చెబుతుండటంతో పాఠశాలల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 వేల ప్రభుత్వ పాఠశాలలపై(Government Schools) ప్రభావం చూపే ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గ్రాంట్ల పేరుతో కొత్త నిబంధనలు!
పాఠశాల స్థాయి, సామర్థ్యాన్ని బట్టి ఒక్కో పాఠశాలకు సుమారు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు, పీఎం,శ్రీ పాఠశాలలకు రూ.4 లక్షల వరకు గ్రాంట్లు కేటాయిస్తారు. స్టేషనరీ, పాఠశాల అవసరాలు, సమావేశాల నిర్వహణ తదితర ఖర్చుల కోసం విద్యా సంవత్సరం పొడవునా ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే, నిధుల విడుదల, బిల్లుల సమర్పణ విధానాల్లో తరచూ మార్పులు చోటుచేసుకోవడం ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ నెల 15వ తేదీలోగా బిల్లులు సమర్పించాలన్న ఆదేశాల నేపథ్యంలో, ఇప్పటికే చేసిన ఖర్చుల బిల్లులతోపాటు అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు చేయాల్సిన ఖర్చులకు కూడా ముందుగానే బిల్లులు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో కొనుగోలు చేయాల్సిన వస్తువులకు ఇప్పుడే బిల్లులు ఎలా సమర్పించాలన్నది హెచ్ఎంలకు అంతుపట్టడం లేదు. నిర్ణీత గడువులోగా బిల్లులు సమర్పించకపోతే మంజూరైన గ్రాంట్లను వెనక్కి తీసుకుంటామన్న హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రెండేళ్లలో రెండు విధానాలు..
2024 వరకు పాఠశాలల గ్రాంట్లను ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్ సంయుక్త ఖాతాలో జమ చేసేవారు. అవసరాలకు అనుగుణంగా ఖర్చులు చేసిన అనంతరం వాటికి సంబంధించిన బిల్లులను సమర్పించి, తదుపరి ఆడిట్ నిర్వహించే విధానం అమల్లో ఉండేది.గతేడాది పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్) ద్వారా చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో హెచ్ఎం, ఎస్ఎంసీ చైర్మన్‌తోపాటు కమిటీలోని ఐదుగురు సభ్యులతో కూడిన సంయుక్త ఖాతా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను వెబ్సైట్లో అప్లోడ్ చేసి, వోచర్ రూపొందించిన అనంతరం బ్యాంకు ద్వారా చెల్లింపులు పొందే విధానం అమల్లో ఉండేది.తాజాగా పీఎఫ్ఎంఎస్ విధానాన్ని నిలిపివేసి, కొత్తగా సీఎఫ్ఎంఎస్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో బిల్లులను మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈవోలకు) సమర్పిస్తే, గ్రాంటు నిధులు విడుదలైన తర్వాత నేరుగా సంబంధిత వ్యాపారి ఖాతాలోనే నగదు జమ చేస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది.

వ్యాపారుల వివరాల సేకరణతో మరో సమస్య..
కొత్త విధానంలో భాగంగా వస్తువులు సరఫరా చేసే వ్యాపారుల బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, వెండర్ కోడ్, ఫొటో తదితర వివరాలను సమర్పించాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. వెండర్ కోడ్ అంటే ఏమిటి? దాన్ని ఎలా పొందాలి? అవసరమైన వివరాలను ఎక్కడ నమోదు చేయాలి? అనే అంశాలపై స్పష్టత లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటివరకు పాఠశాల అవసరాలకు ప్రధానోపాధ్యాయులే ముందుగా డబ్బులు వెచ్చించి, గ్రాంట్లు వచ్చిన తర్వాత బిల్లుల ఆధారంగా నగదు పొందేవారు. తాజా విధానంలో ఆ మొత్తాన్ని నేరుగా వ్యాపారుల ఖాతాల్లో జమ చేస్తే, అత్యవసర అవసరాలను తీర్చడంలో ఎలాంటి విధానం అనుసరించాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భవిష్యత్తు ఖర్చులకు ముందస్తు బిల్లులా?
అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పాఠశాలలకు అవసరమయ్యే వస్తువులు, స్టేషనరీ తదితర ఖర్చులు ముందుగానే అంచనా వేయడం సాధ్యమైనా, వాస్తవంగా కొనుగోళ్లు జరగకముందే బిల్లులు సమర్పించడం ఎలా సాధ్యమని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బిల్లుల తయారీ, కొనుగోళ్లు, చెల్లింపుల విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే బాధ్యత ఎవరిదన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ప్రత్యేకించి రూ.లక్షల్లో గ్రాంట్లు పొందే పీఎం-శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి రూపాయి ఖర్చుకు లెక్కలు చూపాల్సి ఉంటుందని, ముందస్తు బిల్లుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా ఒత్తిడి చేయడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.
స్పష్టత ఇవ్వాలి.. ఇబ్బందులు తొలగించాలి..
పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయడంతోపాటు, వాటి వినియోగంలో పారదర్శకత ఉండటం ఎంత ముఖ్యమో, ప్రధానోపాధ్యాయులకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా చూడటం కూడా అంతే అవసరం. భవిష్యత్తు ఖర్చులకు ముందస్తు బిల్లులు సమర్పించాలన్న నిబంధనపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని, సీఎఫ్ఎంఎస్ విధానంలో వెండర్ నమోదు, బిల్లుల సమర్పణ, చెల్లింపుల ప్రక్రియను వివరించాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి.గ్రాంట్లను వెనక్కి తీసుకుంటామన్న హెచ్చరికలతో కాకుండా, ఆచరణ సాధ్యమైన మార్గదర్శకాలతో పాఠశాలల నిర్వహణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వారు ఆశిస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
