దర్జాగా ప్రభుత్వ భూమిలో ‘నోమా నిలయం’ పేరుతో విల్లాల నిర్మాణం
- చెంగిచెర్లలో దొంగ పాసు బుక్కుతో మాయమైన ప్రభుత్వ భూమి..
- బి.ఆర్.ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన భూ స్కాం..
- కాసులకు కక్కుర్తి పడి కబ్జాలకు అండగా నిలిచిన అవినీతి అధికారులు..
- రెవెన్యూ రికార్డులు ట్యాపరింగ్ చేసి నకిలీ ఖాతా నెంబర్లతో కబ్జాలు..
- బోగస్ పత్రాలపై హెచ్‌ఎండీఏలో అడ్డదారిలో అక్రమంగా నిర్మాణ అనుమతులు
- అమాయక ప్రజలకు అమ్మి మోసం చేసే పనిలో మునిగిపోయిన ముత్తిరెడ్డి..
- ఈ కబ్జా వ్యవహారంపై ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో పిర్యాదు చేసిన వైనం..
- సదరు ఫిర్యాదుకే దిక్కులేకుండా పోయిన దౌర్భాగ్యం..
- ఈ డాక్యుమెంట్ల ట్యాపరింగ్ లో భాగస్వాములైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..
- ప్రభుత్వ భూమిని పరిరక్షంచాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు..
రికార్డులు ట్యాపరింగ్ జరిగాయని ఒక అద్భుతమైన కథ అల్లారు.. దొంగ పాసుబుక్ సృష్టించారు.. ఆపై ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.. విచిత్రం ఏమిటంటే అలా కబ్జా చేసిన భూమిలో ప్లాటింగ్ చేసి అమాయకులకు అంటగట్టారు.. అంతేకాదు మరోకారి అదే పద్దతిలో రెండవసారి కూడా అమాయకులకు అంటగట్టారు.. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మూడవసారి కూడా ఇదే ప్లానుతో మరికొంతమంది అమాయకులకు అంటగట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.. ఒకే భూమి నకిలీ దస్తావేజులు.. మకిలిపట్టిన నకిలీ వ్యవహారాలు.. విచిత్రం ఏమిటంటే ఇదంతా అధికార ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేశారు అనుకుంటే పొరబాటే..

ఆయన ఓడిపోయిన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయినా ఎవరికీ జంకడం లేదు.. వెనుకంజ వేయడం లేదు.. యథేచ్ఛగా తన కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు.. ఏమిటి ఇతని ధైర్యం..? డబ్బులు.. ఎస్ మనీ.. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతాడు.. అధికారులను కొనేస్తాడు.. ఆయన ఉంటున్న పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ఆయనకు ఏమీ తేడా ఉండదు.. అది ఆయన స్పెషాలిటీ.. ఆయనే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. కడుపునపుట్టిన కూతురే తన తండ్రి కబ్జాకోరని బహిరంగంగా విమర్శించడం గతంలోనే మనం చూసాం.. ఇది ఈయనగారి ఘన చరిత్ర..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, మేడిపల్లి మండలం, చెంగిచర్ల గ్రామం సర్వే నెంబర్ 33లో ప్రభుత్వభూమి ఉన్నట్లు రెవెన్యూ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతమైన ఈ చెంగిచెర్ల గ్రామం గతంలో ఘటకేసర్ మండల పరిథిలో నెలకొని ఉండేది.. ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసిన కబ్జాకోరులు తమ వక్రబుద్ధి ప్రదర్శించి కబ్జాలకు తెరలేపారు.. ఇంకేముంది చంగిచెర్ల గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను తగలబెట్టేసినట్లు ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తు న్నారు.. వివరాల్లోకి వెళ్తే…. సర్వే నెంబర్ 33లో బీ.ఆర్.ఎస్. పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సృష్టించిన నకిలీ రికార్డులే ఈ కబ్జా వ్యవహారానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి.. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఏదైనా ఒక గ్రామ శివారులో ఒక వ్యక్తికి ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉన్నా సరే..
ఆ వ్యక్తికి ఒక పట్టా (ఖాతా) నెంబర్ ఇచ్చి సదరు వ్యక్తికి సంబంధించిన భూమి ఆ వ్యక్తి ఖాతాలో నమోదు చేస్తారు.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 1998లో అక్రమంగా పహాణీలో నమోదు చేసినట్లుగా నకిలీ పహాణీలు సృష్టించి రికార్డుల ట్యాపరింగ్ కు తెరలేపారు.. అంతా బాగుంది అనుకుంటూనే పప్పులో కాలేశాడు ముత్తిరెడ్డి.. రికార్డులో పేర్లు మార్చడంతో పాటు ఖాతా నెంబర్లను కూడా మార్చేశాడు.. దీంతో అడ్డంగా దొరికిపోయాడు.. సోకాల్డ్ బీ.ఆర్.ఎస్. మాజీ ఎమ్మెల్యే.. దీంతో స్థానికులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.. అందుకు నిదర్శనమే ఈ ఖాతా నెంబర్ల మార్పిడి అక్రమ వ్యవహారం.. ఈ ప్రభుత్వ భూమిని పరిరక్షంచడానికి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేదీ 12 జులై 2019 నాడు ఎండోమెంట్ కమిషనర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ లకు నాడు ఎంపీగా ఉన్న సమయంలో ఫిర్యాదు చేయడం ముత్తిరెడ్డి చేసింది కబ్జానే అన్న విషయం తేటతెల్లమవుతుంది..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వభూమిని పరిరక్షంచ డానికి ఫిర్యాదు చేస్తే దాన్ని చెత్తబుట్టలో పడేశారు అధికారులు.. ప్రస్తుతం మేడిపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పడేసిన ఎంగిలిమెతుకులకు ఆశపడి కబ్జా చేస్తూ ఉంటే కట్టడి చేయాల్సింది పోయి పరోక్ష సహకారం అందించడంతో మండిపడుతున్నారు స్థానికప్రజలు.. ఏదైనా నిర్మాణ పనులు చేపట్టాలంటే మున్సిపల్ చట్ట ప్రకారం వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్చుకుని, తాను కొనుగోలు చేసిన లింక్ డాక్యుమెంట్స్ తో సహా సమర్పించి నిర్మాణ అనుమతులు చట్టబద్ధంగా పొందాలి.. ఆది నుండి అన్నీ అక్రమాలే చేసుకుంటూ వస్తున్నా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఒక దొంగ పట్టా పాసు బుక్ తో ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్ముకుంటూ.. సొమ్ము చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు.. నకిలీ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వ భూమిని అమ్ముకుంటూ వస్తున్నా కూడా ముత్తిరెడ్డి అవినీతి అధికారుల అండతో సృష్టించిన పాసు బుక్ లో మాత్రం భూమి తగ్గడం లేదు..
మరిప్పుడు నోమా నిలయం పేరుతో విల్లాలు నిర్మిస్తున్న సంబంధిత రికార్డులను పరిశీలిస్తే.. 2002లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సృష్టించిన ఖాతా నెంబర్ 28లో గల భూమిలో నిర్మాణపనులు చేబడుతున్నట్లు చూపించాడు..ఈ యొక్క ఖాతా నెంబర్ గల పట్టా పాసు బుక్ సృష్టించిన డాక్యుమెంట్ అని నాటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రవిచంద్ర ఐఏఎస్ తేదీ :5-2-2005 నాడు కేసు నెంబర్ డీ 5/380/2004 ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.. దీంతో ఆ పాసు బుక్కులు చెల్లనేరవని ఈ ఆదేశాలు సుస్పష్టం చేస్తున్నాయి.. భూ భారతి చట్ట ప్రకారం రికార్డులను పరిశీలించినట్లయితే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఖాతా నెంబర్ 28 కాస్తా 71గా మారడం ఒకే వ్యక్తి రెండు ఖాతా నెంబర్లు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.. ఇక్కడ పరిశీలించాల్సిన మరో విషయం ఏమిటంటే విల్లాలు నిర్మిస్తున్న స్థలం నాలా కన్వర్షన్ చేసినట్లు తేదీ 6-5-2019 రోజున కీసర ఆర్.డి.ఓ. వీ. లచ్చిరెడ్డి ప్రొసీడిరగ్ నెంబర్ బి 2/618/2019 ద్వారా దొంగ పట్టా పాసు బుక్ కు నాలా కన్వర్షన్ చేసి మ్యాన్యువల్ గా ఇచ్చారు..

ఇక్కడ మేడిపల్లి మండల తహశీల్దార్ బీ/270/2018.. తేదీ : 24-4-2019 గల లేఖ ద్వారా నాలా కన్వర్షన్ కోసం ఆర్.డీ.ఓ. కు దరఖాస్తు పంపాడు.. ఇక్కడ మేడిపల్లి తహశీల్దార్ తో పాటు కీసర ఆర్.డీ.ఓ. లకు తెలిసే జరిగింది.. నాలా కన్వర్షన్ చేయడం కంటే ముందు వీరు సృష్టించిన పహాణీలలోనే ప్లాట్లుగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి.. ఇది తెలిసినా ఎమ్మార్వో, ఆర్దీఓ లు ఏ విధంగా నాలా కన్వర్షన్ చేశారు..? ఏ విధంగా పట్టా పాస్ బుక్ మంజూరు చేశారు..? నేటికీ నాలా కన్వర్షన్ అయినట్లుగా సృష్టించిన అధికారులే ప్రస్తుత భూ భారతిలో వ్యవసాయ భూమిగా పెట్టి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేస్తున్న కబ్జాలకు నిస్సిగ్గుగా ఏవిధంగా సహకరించారో ఇట్టే తెలిసిపోతోంది.. 28 ఖాతా నెంబర్ ను 71 ఖాతాకు మార్చిన అవినీతి రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆ ఖాతా నెంబర్ ను మరో అక్రమార్కుడికి అంటగట్టి మరో చోట భూమి కబ్జాకు సహకరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది..
మరి దొంగపాసు పుస్తకాలు సృష్టించిన వ్యక్తిపైన పోలీసులకు ఫిర్యాదు చేసి కటకటాల్లోకి పంపాల్సిన అధికారులు కబ్జాదారులతో ములాఖాత్ అయి ఉండటంతో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని తేటతెల్లం అవుతోంది.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మీరు ఎంపీగా ఉన్న సమయంలో చేసిన ఫిర్యాదుపై ఇప్పుడు విచారణ చేయించి, ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వాములైన అధికారులపై భూ భారతి చట్టంలోని రికార్డుల ట్యాపరింగ్ చేస్తే తీసుకోవాల్సిన చర్య ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్ట రీత్యా శాఖాపరమైన చర్యలు తీసుకుని విధులనుండి తొలగించి విచారణ జరిపించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు..
ముత్తిరెడ్డి నకిలీ పత్రాలతో అడ్డదారిలో అనుమతులు పొంది మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివారులో నోమా నిలయం పేరుతో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలను తక్షణమే కూల్చివేయాలి.. ప్రభుత్వ భూమిని పరిరక్షంచాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించడంలో భాగంలో చెంగిచెర్ల గ్రామ శివారులో ఎన్ని ఖాతా నెంబర్లకు భూ యజమానిగా అవతారమెత్తి ఎంతమంది అమాయకులను మోసం చేశాడు..? ముత్తిరెడ్డి ఈ నకిలీ పత్రాలతో ఎంతమంది అమాయకులకు ప్లాట్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు..? ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న భూమిని ఎలా కొల్లగొట్టాడు.? ఈ వ్యవహారంలో మేడిపల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ సైదిరెడ్డి హస్తం ఏ మేరకు వుంది..? ఖాతా నెంబర్లు మార్చడం, ప్రభుత్వ భూములను కొల్లగొట్టడంలో రెవెన్యూ అధికారుల తీరు, చేసిన అక్రమాలపై పూర్తి ఆధారాలతో మరో సంచలన కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘‘ ఆదాబ్ హైదరాబాద్’’ ..‘‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం’’..
