Saturday, June 6, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | ప్రభుత్వ భూమిపై.. ప్రైవేట్ పంజా..

Encroachment | ప్రభుత్వ భూమిపై.. ప్రైవేట్ పంజా..

ప్రభుత్వ నేలను మింగేసిన బిల్డర్.. అండగా నిలిచిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు!

  • మియాపూర్‌లోని స.నెం. 29 లోని 5203 చ. గజాల ప్రభుత్వ భూమి స్వాహా!
  • అనుమతి ఒకచోట.. అక్రమ నిర్మాణం మరోచోట!
  • అనుమతి లేని సర్వే నంబర్లలో మల్టీస్టోరీడ్ ప్రాజెక్ట్
  • పలుమార్లు రిజెక్ట్ అయిన ఫైల్‌కు ఓసీ మంజూరు
  • అక్రమాలు ఉన్నా మార్టిగేజ్ విడుదల
  • క్షేత్రస్థాయి తనిఖీలు లేకుండానే అనుమతులు
  • సహకరిస్తున్న పలువురు అవినీతి అధికారులు
  • విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్తలు

ప్రజా ఆస్తులను కాపాడాల్సిన అధికారులే అవినీతికి తెరలేపితే.. అడ్డగోలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేసే భూబకాసురులకు వారే అండగా నిలిస్తే.. ఇక చట్టానికి రక్షణ ఎక్కడ? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎమ్‌సీ) టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన ఒక భారీ అవినీతి భాగోతం ఇప్పుడు నగరంలో సంచలనం సృష్టిస్తోంది.మియాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 28, 34, 35, 36, 37, 37/ఏ లలో మాత్రమే ఒక మల్టీస్టోరీడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చారు. కానీ సదరు బిల్డర్ తన హద్దులు దాటి.. అసలు ఎలాంటి అనుమతులు లేని సర్వే నెంబర్లు 24, 25, 30 లతో పాటు, అత్యంత విలువైన ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్న సర్వే నెంబర్ 29 లోని 1 ఎకరా 03 గుంటల (5203 చదరపు గజాల) స్థలాన్ని అడ్డగోలుగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

- Advertisement -

ఈ ఘోరమైన కబ్జా, నిబంధనల ఉల్లంఘనలపై క్షేత్రస్థాయి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ అక్రమాలను విచారించాల్సింది పోయి, “రికార్డులు పరిశీలించాం, అన్నీ సక్రమంగానే ఉన్నాయి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరే కోర్టుకు వెళ్ళండి” అంటూ ఫిర్యాదును తోసిపుచ్చుతూ బాధ్యతారాహిత్యంగా లేఖ విడుదల చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఫిర్యాదులో పేర్కొన్న ముఖ్యాంశాలు, క్షేత్రస్థాయి పరిశీలనను బట్టి చూస్తే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది:

  • ప్రభుత్వ భూమిలో ‘బ్లాక్-సి’, ‘బ్లాక్-డి’ నిర్మాణాలు: నిషేధిత భూముల జాబితా లో ఉన్న సర్వే నెంబర్ 29 ప్రభుత్వ భూమిని బిల్డర్ కబ్జా చేసి, అందులోనే తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ‘బ్లాక్-సి’, ‘బ్లాక్-డి’ భవనాలను నిర్మించేశారు.
  • పదే పదే రిజెక్ట్ అయిన ఫైల్.. రాత్రికి రాత్రే ఓకే ఎలా అయింది?: సదరు ప్రాజెక్టుకు ఉన్న నిబంధనల ఉల్లంఘనలు, లోపాల కారణంగా గతంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) దరఖాస్తును అధికారులు పలుమార్లు తిరస్కరించారు. ఆ లోపాలను బిల్డర్ సరిచేయలేదు, కబ్జాను వదిలిపెట్టలేదు. అయినా సరే, తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో కానీ.. అధికారులు కళ్ళు మూసుకుని 31.03.2026 న పార్షియల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడం గమనార్హం.
  • ప్రభుత్వ సెక్యూరిటీని సైతం గంగలో కలిపారు! ఏదైనా ఒక భారీ ప్రాజెక్తుకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనల ప్రకారం బిల్డర్ 10% నిర్మాణ స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌కు మార్టిగేజ్ (తాకట్టు) పెట్టాలి. భవన నిర్మాణం పూర్తిగా ప్లాన్ ప్రకారం జరిగితేనే ఆ మార్టిగేజ్‌ను విడుదల చేయాలి. కానీ ఇక్కడ అధికారుల అవినీతి పరాకాష్టకు చేరింది.

ఆశ్చర్యకరమైన విషయం: క్షేత్రస్థాయిలో ఉన్న మార్టిగేజ్ ఏరియాకు, అఫీషియల్ రికార్డుల్లో చూపిస్తున్న ఏరియాకు భారీ తేడాలున్నాయి. బిల్డర్ చేసిన అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూమి కబ్జాను అసలు పరిగణనలోకి తీసుకోకుండా.. నిబంధనలకు విరుద్ధంగా 1316 చదరపు మీటర్ల పూర్తి మార్టిగేజ్ ఏరియాను విడుదల చేస్తూ 28.04.2026 న ‘కన్వేయన్స్ డీడ’ రాసిచ్చేశారు.

అసలు సర్వే నంబర్ 29 అనేది ప్రభుత్వ భూమి అయినప్పుడు, దాన్ని నిర్మాణ సంస్థ ఏ విధంగా తాకట్టు పెట్టగలుగుతుంది? ఒకవేళ పెట్టినా, ఆ మార్టిగేజ్ విడుదల చేయడానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఏ విధమైన హక్కు ఉంటుంది? దీన్నిబట్టి అధికారులు నిబంధనలను, చట్టాలను ఏ విధంగా తుంగలో తొక్కారో స్పష్టమవుతోంది.

  • బాధ్యతారాహిత్య సమాధానం..
    విజిలెన్స్ విచారణకు డిమాండ్!

ఈ వ్యవహారంలో బిల్డర్ తప్పుడు పత్రాలు, తప్పుడు హద్దులు చూపించి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని దోచుకుంటుంటే, టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం సైట్ విజిట్ చేయకుండా, సర్వే సరిహద్దులు చూడకుండా ఏసీ రూముల్లో కూర్చుని సంతకాలు పెట్టేసారని స్పష్టమవుతోంది.పైగా ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉంది. “మేము కేవలం ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ మరియు ఇరిగేషన్ రిపోర్ట్ ఆధారంగానే పర్మిషన్ ఇచ్చాం, సమస్య ఉంటే వేరే ఫోరమ్‌కు వెళ్ళండి” అని చేతులు దులుపుకున్నారు.

ఒక ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే రక్షించాల్సిన కనీస బాధ్యత మున్సిపల్ అధికారులకు లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.బిల్డర్‌కు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ఈ అవినీతి వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి స్వతంత్ర విజిలెన్స్ విచారణ జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఈ అక్రమ అనుమతులను రద్దు చేసి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని, లంచాలకు లొంగి సంతకాలు పెట్టిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News