Homeఆదాబ్ ప్రత్యేకంMattapalli | మట్టపల్లి శ్రీనారసింహుడి ఆలయం కనుమరుగు కానుందా..?

Mattapalli | మట్టపల్లి శ్రీనారసింహుడి ఆలయం కనుమరుగు కానుందా..?

  • కృష్ణానది ఒడ్డున వెలసిన మట్టపల్లి లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం..
  • సూర్యాపేట జిల్లాకే తలమానికంగా వెలుగొందుతున్న పంచారామం..
  • ఇప్పుడీ ఆలయ భవితవ్యంపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు..
  • దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర గల్గిన ఆలయం భూస్థాపితం అయ్యే ప్రమాదం..
  • రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ప్రముఖులు ఈ గుడిని సందర్శించిన సందర్భాలు ఎన్నో..
  • రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో జరిగిన వేలంపాటలో గనిని దక్కించుకున్న ఎన్.సి.ఎల్. కంపెనీ..
  • ఆలయానికి అతి సమీపంలో సున్నపురాయి మైనింగ్ కార్యకలాపాలు జరిగితే కష్టమే..
  • ఇటీవలే ఈ వేలం పాటలపై ప్రభుత్వానికి లేఖ రాసిన మాజీ మంత్రి కేటీఆర్..
  • జరిగిన వేలం పాటపై నిరంతరం కథనాలు రాస్తున్న ఆదాబ్ హైదరాబాద్..

ఈ వేలం పాటను రద్దు చేయాలని కోరుతున్న భక్తులు, సామాజిక వేత్తలు..
వేలంపై కేంద్ర ప్రభుత్వానికి సైతం కంప్లైంట్ చేసిన న్యాయవాది కర్నాటి వెంకటరెడ్డి

సూర్యాపేట జిల్లాలో కృష్ణా నది ఒడ్డున వెలసిన మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, తెలంగాణలోని పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం అత్యంత మహిమా న్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. పురాణాల ప్రకారం, భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు. ఇక్కడ స్వామివారు ఒక గుహలో స్వయంభూవుగా వెలిశారు. ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండేది.

- Advertisement -
Threat To Mattapalli Lakshmi Narasimha Swamy Temple2

సుమారు 11వ శతాబ్దంలో, అనుముల మాచిరెడ్డి అనే భక్తుడికి నరసింహస్వామి కలలో కనిపించి, తను వెలసిన గుహ మార్గాన్ని చూపించారట. స్వామి ఆదేశానుసారం మాచిరెడ్డి ఆ గుహను కనుగొని, అక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించి, ఆలయ అభివృద్ధికి పునాది వేశారు. మట్టపల్లి క్షేత్రం ఇతర నరసింహ క్షేత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. గుహాలయం: గర్భాలయం ఒక సహజసిద్ధమైన గుహ. భక్తులు వంగి లోపలికి వెళ్లి స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామివారు చతుర్భుజాలతో, శంఖు చక్రాలు ధరించి, అభయ ముద్రలో దర్శనమిస్తారు. స్వామివారికి ఎడమ వైపున రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు.

ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యం లేదా సమస్యలతో బాధపడుతుంటారో, వారు ఈ క్షేత్రంలో 11 రోజులు లేదా 21 రోజులు ఉండి, ప్రతిరోజూ కృష్ణా నదిలో స్నానం చేసి, తడి బట్టలతో స్వామికి 32 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

Threat To Mattapalli Lakshmi Narasimha Swamy Temple0

“మట్టపల్లి నరసింహుడు.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం” అని భక్తులు నమ్ముతారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన ఆలయానికి ప్రమాదం ఎదురయ్యే సూచనలు కనిపితున్నాయి.. సోయిలేని ప్రభుత్వ పెద్దలు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ ఆలయం కనుమ రుగైపోయే ప్రమాదం ముంచుకు వస్తోందని భక్తులు కలవరపడు తున్నారు.. అసలేమిటి ఈ ప్రమాదం వివరాలు ఒకసారి చూద్దాం..

2024వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుల్తాన్ పూర్, సైదుల్నామా, పసుపుల బోడ్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో జరిపిన ఈ – ఆక్షన్ ప్రక్రియలో భాగంగా సుల్తాన్ పూర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో నిర్వహించిన వేలం పాటను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే.. వాస్తవాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, మట్టపల్లి గ్రామ శివారులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సున్నపురాయి గని వేలం జరిగిన ప్రదేశాన్ని ఎన్.సి.ఎల్. ఇండస్ట్రీస్ లిమిటెడ్ (నాగార్జున సిమెంట్ లిమిటెడ్) వారు దక్కించుకోవడం జరిగింది..

Threat To Mattapalli Lakshmi Narasimha Swamy Temple

ఒకవేళ ఇదే గనిలో నాగార్జున సిమెంట్ వారు తమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తే.. దాదాపు 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన మట్టపల్లి దేవస్థానం మహత్తర చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది.. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గనుల వేలంలో ఎన్.సి.ఎల్. ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి వేలంలో వచ్చిన ప్రదేశాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఇట్టి విషయం స్పష్టంగా అర్థం అవుతుంది..

ఎందుకంటే ఈ యొక్క మైన్ మట్టపల్లి గ్రామం నుంచి మొదలుకొని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు సమాంతరంగా అతి చెరువులో ఉంది.. అలాగే మట్టపల్లి గ్రామానికి వెళ్లాలంటే కూడా ఈ యొక్క లీజు ప్రాంతం నుంచి వెళ్లవలసిన పరిస్థితి ఎదురవుతుంది.. మట్టపల్లి గ్రామానికి వెళ్లాలన్నా లేదా మట్టపల్లి దేవస్థానానికి వెళ్లాలన్నా.. అదే విధంగా కృష్ణానది అవతల ఉన్న ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఈ మైన్ గుండానే వెళ్ళవలసిన పరిస్థితి వుంది.. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ..

ఈ యొక్క మైనింగ్ వేలంపై ప్రభుత్వం పునరాలోచన చేయ వలసిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఎందుకంటే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి మట్టపల్లి దేవస్థానా నికి రాష్ట్రం నుంచి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో వస్తుంటారు.. అలాగే రాష్ట్రం నలుమూలల్లోంచే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి నారసింహుడిని దర్శించుకుని వెళ్తుంటారు..

అంతే కాకుండా ఎంతో మంది ప్రముఖులు, మంత్రులు, గవర్నర్లు, ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహించి తరించడం జరిగింది.. గత జనవరి నెలలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా పలు అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంతటి విశిష్టతను కలిగిన ఈ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఇటీవలే ఇక్కడ జరిగిన ఈ – వేలం అవకతవకలపై ఆదాబ్ వరుస కథనాలు ప్రచురించడం జరిగింది.. ఈ కథనాలపై స్పందించిన బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ-వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం కూడా జరిగింది..

కాగా సూర్యాపేట జిల్లాలోని పసుపులబోదు, సైదులానామా, సుల్తాన్పూర్ అటవీ బ్లాకుల్లో గనుల ఈ-వేలంపై సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నాటి వెంకట రెడ్డి 2023 డిసెంబర్ 20న ప్రధాని కార్యాలయం, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కు ఫిర్యాదు చేశారు. ఎం.ఎం.డీ.ఆర్. యాక్ట్ – 1957, సెక్షన్లు 10బీ, 11 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వేలం నిర్వహించారని ఆరోపించినప్పటికీ, మూడు నెలల పాటు స్పందించని కేంద్ర గనుల శాఖ 2024 మార్చి 18న ఇచ్చిన సమాధానం సంచలనంగా మారింది.

Threat To Mattapalli Lakshmi Narasimha Swamy Temple1

కాగా ఫిర్యాదును తిరిగి తెలంగాణ రాష్ట్ర గనుల శాఖకే పంపామని చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. “ఎవరిపై ఫిర్యాదు చేశానో వారికే నా ఫిర్యాదు పంపితే, అది న్యాయమా?” అని ఆయన అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం కింద సూర్యాపేట జిల్లా అటవీ శాఖను ఆశ్రయించారు.. మూడు గనుల బ్లాకులకు అటవీ శాఖ ఎలాంటి ఎన్వోసీ ఇవ్వలేదు.. ఆ ప్రాంతాలు కంపార్టుమెంట్లుగా కూడా విభజించబడలేదు. అయినప్పటికీ గనుల శాఖ ఈ-వేలం నిర్వహించింది.. ఇది అటవీ చట్టాలు, పర్యావరణ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.

ఈ – వేలంలో మరింత అనుమానాస్పద అంశం ఏమిటంటే… సైదులానామా బ్లాకు,. దక్కన్ సిమెంట్స్ కి, సుల్తాన్పూర్ బ్లాకు.. నాగార్జున సిమెంట్స్‌కి.. కేటాయించారు.. ఈ రెండు కంపెనీలపై అక్రమ మైనింగ్ కేసులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆరోపణలులేని పసుపులబోడు బ్లాకు మాత్రం పోటీ లేక రద్దయ్యింది.

గనుల శాఖ అధికారులు టెండర్ వివరాలు ఇవ్వమంటే, ఆర్.టి.ఐ. చట్టం సెక్షన్ 8(ఎ), (డి), (ఇ), (జీ), (ఐ) లను సాకుగా చూపిస్తూ.. “సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తుల ప్రాణాలకు ముప్పు” అని సమాధానం ఇవ్వడం గమనార్హం.. ఈ సమాచారం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

హిందూ ధర్మానికి, అడుగడుగునా ఆటంకాలు ఎదుర వుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మహిమాన్విత ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది.. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ – వేలం ప్రక్రియపై దృష్టి సారించి, వేలాన్ని రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.. ఎంతో విశిష్టతతో భక్తులకు ఆలవాలంగా నిలుస్తున్న మట్టపల్లి శ్రీలక్ష్మి నారసింహ ఆలయాన్ని పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు..

కాగా సుల్తాన్ పూర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో సర్వే నంబర్ 88లో నిర్వహించిన సున్నపురాయి మైనింగ్ గని వేలాన్ని ప్రభుత్వం తక్షణ రద్దు చేయాలి.. లేదంటే దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు, మట్టపల్లి గ్రామం చరిత్ర పూర్తిగా ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయవాది, హిందూ ధర్మ పరిరక్షకుడు కర్నాటి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News