కొండాపూర్‌లో నిబంధనలకు తూట్లు..
టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి కోట్లల్లో గండి
- ఓసీ, శాంక్షన్డ్ ప్లాన్‌లో భవన వినియోగం నివాసంగానే నమోదు
- క్షేత్రస్థాయిలో ‘జూబ్లీ పార్క్ హోటల’ పేరుతో కార్యకలాపాలు..
- కమర్షియల్ ట్యాక్స్ స్థానంలోరెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లింపులు..
- ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలని ప్రజల డిమాండ్..
- కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు..
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బండారం మరోసారి బట్టబయలైంది. శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని కొండాపూర్‌లో(Kondapur) నివాస అనుమతులతో ఏకంగా వాణిజ్య హోటల్ నిర్వహిస్తున్నా, అధికారుల కంట్లో మాత్రం ఆ అక్రమాలు పడకపోవడం వెనుక పెద్ద తతంగమే నడుస్తోందన్న విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నా పట్టించుకోని కొందరు స్వార్థపరులైన అధికారులు, తమ జోబులు నింపుకోవడమే ధ్యేయంగా శరవేగంగా విధులు నిర్వర్తించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
అనుమతి నివాసానిది.. దందా హోటల్ వ్యాపారానిది! : కొండాపూర్ గ్రామం, శేర్లింగంపల్లి మండలం, సర్వే నంబర్ 71, ప్లాట్ నంబర్లు సి-68, సి-69లో వెలసిన భవనానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ ప్రొసీడింగ్స్ నంబర్: 008400/జీహెచఎంసీ/03911/ఎస్‌డబ్ల్యూఓసీ/ఎసఎల్పీ2/2025, తేదీ: 30-11-2025) ప్రకారం దీనిని కేవలం “రెసిడెన్షియల” (నివాస గృహం) కోసమే మంజూరు చేశారు.
ఐదు పై అంతస్తులు, మొత్తం 1,366.50 చదరపు మీటర్ల బిల్ట్-అప్ ఏరియా కలిగిన ఈ భవనానికి సంబంధించిన శాంక్షన్డ్ ప్లాన్ మరియు కంప్లీషన్ ప్లాన్ రెండింటిలోనూ భవన వినియోగం నివాసంగానే స్పష్టంగా నమోదైంది.(aadabhyderabad.in) కాని క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా “జూబ్లీ పార్క్ హోటల” పేరుతో పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. నివాస అనుమతి ఉన్న భవనంలో కమర్షియల్ వ్యాపారం నడుస్తున్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం స్పందించకపోవడం వారి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి, లాలూచీకి అద్దం పడుతోంది.

ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆర్థిక నష్టం : ఈ అక్రమ తతంగం వల్ల ప్రభుత్వానికి జరుగుతున్న ఆర్థిక నష్టం అంతా ఇంతా కాదు. నిబంధనల ప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) లోని భవన వినియోగం (రెసిడెన్షియల్) ఆధారంగానే ప్రాపర్టీ టాక్స్ ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. వాణిజ్య భవనాలకు లేదా హోటళ్లకు వర్తించే కమర్షియల్ పన్ను రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ భవన యజమానులు అధికారులతో కుమ్మక్కై నివాస ఓసీని చూపించి, అత్యంత తక్కువగా ఉండే రెసిడెన్షియల్ ప్రాపర్టీ టాక్స్ మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి తీవ్రమైన గండి కొడుతున్నారు.
వాణిజ్య సముదాయంగా ఉపయోగపడుతున్న ఈ భవనానికి కమర్షియల్ ట్యాక్స్ మరియు కమర్షియల్ ట్రేడ్ లైసె న్స్ ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా, అధికారుల ఉదాసీనత వల్ల ప్రతి నెలా ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయల ఆదా యం కోల్పోవాల్సి వస్తోంది. ప్రజల పన్నులతో నడిచే వ్యవస్థలో, కొందరు అధికారులు తమ పదవులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుండటం తీవ్రంగా ఖండించదగ్గ విషయం.
తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్న ఈ అక్రమ హోటల్ నిర్వహణపై మరియు దీనికి అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టకుండా, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులు మరియు భవన యజమానులపై మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. రెసిడెన్షియల్ ముసుగులో సాగుతున్న ఈ వాణిజ్య దందాపై ఉన్నతాధికారులు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!
