Saturday, April 18, 2026
Homeరంగారెడ్డిInspection | గండీడ్ కె.జి.బి.వి లో ఆకస్మిక తనిఖీ

Inspection | గండీడ్ కె.జి.బి.వి లో ఆకస్మిక తనిఖీ

  1. విధుల పట్ల నిర్లక్షం వహించిన ముగ్గురు పాఠశాల సిబ్బంది పై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్.
  2. కె జి బి వి ప్రత్యేక అధికారి సస్పెండ్
  3. సి.ఆర్.టి ఇంగ్లీష్ అధ్యాపకురాలికి షోకాజ్ జారీ.
  4. నైట్ వాచ్ మెన్ సస్పెన్షన్.

మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గండీడ్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పాఠశాల సిబ్బందిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో సరైన పర్యవేక్షణ చేయకుండా ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు కె. జి. బి. వి ప్రత్యేక అధికారి డి.పావనిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే సి.ఆర్.టీ ఇంగ్లీష్ అధ్యాపకురాలైన శోభ విద్యార్థులకు పాఠాలు సరిగా చెప్పనందుకు షోకాజ్ నోటీసు జారీచేశారు. పాఠశాల నైట్ వాచ్మెన్ జైతున్ బేగం, తన భర్త ద్వారా నైట్ డ్యూటీ చేయిస్తున్నందున సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

తనకి సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాఠశాలలో ని 7, 8, 9వ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మీరు బాగా చదువుతున్నారా? టీచర్లు పాఠాలు సరిగా బోధిస్తున్నారా? లేదా? పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ, హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉన్నది, తరచుగా హీమోగ్లోబిన్ పరీక్షలు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

అనంతరం పాఠశాలలోని డార్మెట్రీ ని సందర్శించి పరిశీలించారు. డార్మెట్రిలో ఫ్యాన్లు, లైట్లు సరిగా పనిచేయకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. వేసవిలో వేడి ఎక్కువగా ఉన్నందున డార్మెట్రీలో, తరగతి గదులలో కచ్చితంగా ఫ్యాన్లు, లైట్లు ఉండేటట్టు చూసుకోవాలని, ఈ సందర్భంగా విద్యార్థులు వర్షాకాలంలో సీలింగ్ పైకప్పు నుండి తరచూ నీరు కారుతుందని కలెక్టర్ కు తెలిపారు. విద్యార్థులకు శుభ్రమైన త్రాగు నీరు అందించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలలో మరుగు దొడ్లు, వాటిలో నీటి వసతి సరిగా ఉన్నదా లేదా అనే విషయాలను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్టోర్ రూము ను సందర్శించి స్టాక్ రికార్డును పరిశీలించారు. పప్పు, బియ్యం, నూనె, కూరగాయల స్టాక్ వివరాలు ఎందుకు సరిగా నిర్వహించడంలేదని అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న ముగ్గురిపై చర్యలు తీసుకుంటున్నానని కలెక్టర్ పేర్కొన్నారు . ఇకనుంచి అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News