Friday, November 14, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్IJU Plenary | ఫిబ్రవరిలో ఐజేయూ ప్లీనరీ

IJU Plenary | ఫిబ్రవరిలో ఐజేయూ ప్లీనరీ

విజయవాడలో నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే నిర్ణయం

ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (IJU) ప్లీనరీ సమావేశాలను ఫిబ్రవరి మొదటి వారంలో విజయవాడ(Vijayawada)లో నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే(Apuwj) నిర్ణయించింది. యూనియన్‌ అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాలులో యూనియన్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐ.జే.యూ. జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ (Telangana Media Academy) చైర్మన్‌ (Chairman) కె. శ్రీనివాస్‌ రెడ్డి, సి.రాఘవాచారి ప్రెస్‌ అకాడమీ(Press Academy), ఆంధ్రప్రదేశ్, చైర్మన్‌ ఆలపాటి సురేష్‌ కుమార్‌, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో జర్నలిస్టుల (Journalists) సమస్యలతోపాటు ఐజేయూ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్‌ అగ్రనేత శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ఐజేయూ ఆవిర్భావం తర్వాత 1992లో రెండో ప్లీనరీ విజయవాడలో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐజేయూ 11వ ప్లీనరీని నిర్వహించే అవకాశం మరోసారి ఏపియుడబ్ల్యుజే కు వచ్చిందని, ప్లీనరీని విజయవాడలోనే నిర్వహించాలని యూనియన్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో జర్నలిస్టు సమస్యలు, వృత్తి విలువల రక్షణకై తీసుకోవల్సిన చర్యలు, జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ మహాసభలకు దేశం నలుమూలల నుండి దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరవుతారని, ప్లీనరీని విజయవంతం చేయడానికి ప్రజాస్వామ్యవాదులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐజేయూ ప్లీనరీ నిర్వహణకు మొత్తం తొమ్మిది కమిటీలు ఏర్పాటు చేయాలని కార్యవర్గ విస్తృత సమావేశం నిర్ణయించింది. అలాగే ఐజేయూ ప్లీనరీని పురస్కరించుకుని మంచి వ్యాసాలతో సావనీర్‌ను విడుదల చేయాలని సమావేశం తీర్మానించింది. ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా విజయనగరానికి చెందిన పి.ఎస్.ఎస్.వి. ప్రసాదరావును కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌ బాబును యూనియన్ క్రమశిక్షణ, అర్హతల కమిటీ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు.

ఇవిగాక ప్లీనరీ ఏర్పాట్ల కోసం వివిధ ఉప కమిటీలను త్వరలో ఏర్పాటు చేయాలని, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్స్అసోసియేషన్‌, సామ్నా రాష్ట్ర సమావేశాలను నిర్వహించాలని విస్తృత కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి కంచల జయరాజ్‌ యూనియన్‌ ఇటీవల కాలంలో నిర్వహించిన కార్యకలాపాలపై నివేదిక సమర్పించగా, మాజీ ప్రధానకార్యదర్శి చందు జనార్థన్‌, ఐజేయూ జాతీయ కార్యవర్గసభ్యులు నల్లి ధర్మారావు, డా. ఎం .ప్రసాద్‌ ప్రసంగించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 26 జిల్లా శాఖల అధ్యక్ష కార్యదర్శులు, కన్వీనర్లు సమావేశంలో పాల్గొన్నారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News