- ఈ పరిశ్రమ నుండి భారీ స్పందన, వ్యాపార లావాదేవీలకు వేదిక సిద్ధం
దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద బీ2బీ (B2B) జ్యువెలరీ వేడుకలలో ఒకటైన ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’ (HJF 2026) 18వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ హెచ్ జె ఎం ఏ సహకారంతో ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా ఈ ప్రదర్శనను నిర్వహిస్తోందన్నారు. రాబోయే పండుగలు మరియు వివాహాల సీజన్ దృష్ట్యా కొనుగోలుదారులలో నెలకొన్న ఉత్సాహానికి ప్రతిబింబంగా, ఈ ప్రదర్శన మొదటి రోజే 350 కి పైగా ఎగ్జిబిటర్లు, 750 కి పైగా బ్రాండ్లు, రీటైలర్లు మరియు పరిశ్రమకు చెందిన ప్రముఖుల భాగస్వామ్యంతో మొదలైందన్నారు.
ఈ ప్రదర్శనను ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్, వామన్ హరి పేతే జ్యువెలర్స్ పార్ట్‌నర్ ఆశిష్ పేతే జోస్ అలుక్కాస్ గ్రూప్ డైరెక్టర్ పాల్ జె అలుక్కాస్, ఇంద్రియ (ఆదిత్య బిర్లా గ్రూప్) న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ అనీష్ హెచ్ కుమార్, ది న్యూ జ్యువెలర్ ఇంటర్నేషనల్ మీడియా గ్రూప్ ఎడిటర్ సుబ్బు ప్రారంభించారు. ఈ ప్రదర్శన ప్రారంభం నుండే అద్భుతమైన డిజైన్లు, కళాకృతులు మరియు వ్యాపార లావాదేవీలతో సందడిగా మారింది. కొనుగోలుదారులు బంగారం, డైమండ్, వెండి మరియు లైట్‌వెయిట్ జ్యువెలరీ విభాగాలపై విపరీతమైన ఆసక్తిని కనబరిచారు.
ముఖ్యంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉన్న కలెక్షన్లు మరియు వేగంగా అమ్ముడయ్యే డిజైన్లపైనే బీ2బీ (B2B) చర్చలు ప్రధానంగా సాగాయన్నారు. ఈ ఏడాది ప్రదర్శనలో ‘జ్యువెలరీ రీటైల్ సింపోజియం’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. దీనితో పాటు ముంబైకి చెందిన ‘జవేరీ బజార్ పెవిలియన్’ మరియు మరికొన్ని ప్రత్యేక జోన్‌లను మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టారు.
రీటైల్ సింపోజియంలో పరిశ్రమలోని ప్రముఖులు పాల్గొని రీటైల్ రంగంలో వస్తున్న మార్పులు, టెక్నాలజీ వినియోగం మరియు ప్రీమియమైజేషన్ వంటి అంశాలపై చర్చించారు. ఇక సోర్సింగ్ విషయానికి వస్తే, ముంబైకి చెందిన ప్రముఖ తయారీదారులతో నేరుగా వ్యాపారాలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన జవేరీ బజార్ పెవిలియన్ రీటైలర్లను విశేషంగా ఆకట్టుకుంది. దీనివల్ల మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కలెక్షన్లను రీటైలర్లు సులభంగా అన్వేషించే అవకాశం కలిగిందన్నారు.
