- నిన్న మంగళవారం మార్చి 3 న 4421 మెగావాట్లకు చేరిన గరిష్ట డిమాండ్..
- ఇప్పటివరకు నమోదయిన అత్యధిక డిమాండ్ ఇదే..
- 2024 మే 6 న రికార్డయైన గరిష్ట డిమాండ్ 4352 మెగావాట్లు..
- మే రికార్డును అప్పుడే దాటిన విద్యుత్ వినియోగం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం (మార్చి 3) రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇదే. గత ఏడాది మే 6న అత్యధికంగా 4,352 మెగావాట్ల రికార్డును ఈసారి మార్చి నెలలోనే అధిగమించడం విశేషం.
సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ప్రధానంగా ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వినియోగం పెరుగుతుండటంతో డిమాండ్ భారీగా నమోదవుతుంది.
రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా నిరంతర సరఫరా అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, 33 కేవీ/11 కేవీ ఫీడర్ల పై, సబ్ స్టేషన్ల లోని పవర్ ట్రాన్స్ ఫార్మర్ల లోడ్ ను పర్యవేక్షించాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
