- చివ్వెంలలో నామినేషన్ల రద్దీ.
- నామినేషన్ల రద్దీలో జిపిఓ నిర్లక్ష్యం.
- భోజన విరామ సమయంలో ఇంటికి.
- నామినేషన్ల చివరి రోజున ఇలా ఎలా.?
- ఆర్వో, అధికారులు కేంద్రంలో ఉండగా జిపిఓ గైర్హాజరు ప్రశ్నార్థకం.?
- విధుల్లో జిపిఓ నిర్లక్ష్యంపై విమర్శలు.
పంచాయతీ ఎన్నికల సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పలు మండలాలలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ గత రెండు రోజులుగా కొనసాగుతుంది. చివ్వెంల గ్రామపంచాయతీ కార్యాలయంలో, చివ్వెంల, మూన్య నాయక్ తండా, సూర్య నాయక్ తండా గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు అధికారులు. నామినేషన్లు వేయడానికి మంగళవారం చివరి రోజు అవడంతో నామినేషన్ దారులు పెద్ద ఎత్తున నామినేషన్లకు వేయడానికి తరలివచ్చారు.
ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన స్వీకరణలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఆర్వోతో పాటు సంబంధిత మండల, పంచాయతీ శాఖ సిబ్బంది అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అధికారులు భోజన విరామం తీసుకున్నారు. నిర్వాహకులు ముందుగానే ఏర్పాటు చేసిన భోజనాన్ని అధికారులు, సిబ్బంది అందరూ అక్కడే ఆరగించారు.

ఇంటికెళ్లి తీరిగ్గా భోజనం…
అయితే ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న జిపిఓ విజయ తీసుకున్న నిర్ణయం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనం వద్దని, ఆమె తన ఇంటికి 1:30 పీఎం కి (వట్టిఖమ్మం పహాడ్) వెళ్లి భోజనం చేయడం, తిరిగి 2:45 పీఎం గంటలకు విధులకు రావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నామినేషన్ల చివరి రోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉండగా, కార్యాలయంలో సిబ్బంది కొరత తలెత్తింది. ఈ పరిస్థితుల్లో సమయానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల కొంతసేపు ప్రక్రియ మందగించింది.
జిపిఓ అందుబాటులో లేకపోవడంతో పక్క గ్రామపంచాయతీలో పని చేస్తున్న “జిపి వర్కర్” తో నామినేషన్ల ఫారాలు పరిశీలన అప్పగించారు. దీంతో అక్కడికి వచ్చిన నామినేషన్ దారులు అవాక్కయ్యారు.అభ్యర్థులు, వారి అనుచరులు దీనిపై స్పందిస్తూ నామినేషన్ల స్వీకరణలాంటి కీలక సమయంలో సిబ్బంది ఇష్టానుసారంగా బయటకు వెళ్లడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విధమైన వ్యవహారం ఎన్నికల ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆరోపించారు.

జిపిఓ నిర్లక్ష్యంపై అధికారుల మౌనం? :
నామినేషన్ దారులు, కేంద్రానికి వచ్చిన ప్రజలు ఈ సంఘటనను తీవ్రమైన విధుల ఉల్లంఘనగా పేర్కొంటూ జిపిఓపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి, ప్రతి సిబ్బంది తగిన సమయానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన సమయంలో ఇలా అధికారుల నిర్లక్ష్యం ప్రజలను విస్మయానికి గురిచేసిందన్నారు.నామినేషన్లు భారీగా వచ్చిన సందర్భంలో ప్రతి నిమిషం విలువైనదని, అలాంటి సమయంలో సిబ్బంది లోపిస్తే వ్యవస్థ నిలిచిపోతుందని అభ్యర్థులు పేర్కొన్నారు.
అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి జిపిఓ ప్రవర్తనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సెంటర్ ఆర్వో ఇతర అధికారులు మౌనంగా ఉండి పోయారు.నామినేషన్ల స్వీకరణ పటిష్టంగా, పారదర్శకంగా సాగాల్సిన సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తదుపరి రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మండల ఎన్నికల అధికారి సంతోష్ కుమార్ ని వివరణ కోరగా, ఈ విషయం మా దృష్టికి రాలేదని తెలిపారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
