Thursday, February 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంDevarayanjal | దేవరయంజాల్ భూములకు దిక్కెవరు?

Devarayanjal | దేవరయంజాల్ భూములకు దిక్కెవరు?

కోర్టు తేల్చకముందే అక్రమ నిర్మాణం
తూంకుంట సర్కిల్‌లో సర్కారు స్థలం కబ్జా
పట్టించుకోని ప్రభుత్వ అధికారులు
కాంగ్రెస్ నేత అండతో పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి అటువైపు వెళ్లట్లేదని ఆరోపణలు

(మేడ్చల్ జిల్లా ప్రతినిధి)

- Advertisement -

దేవరయంజాల్ భూములకు దిక్కెవరు అనేది మిలీనియం ప్రశ్న(Millennium Question)గా మిగిలిపోయింది. ఆ భూములు దేవుడికి చెందుతాయా? లేక, రైతులకు చెందుతాయా అనేది అంతుచిక్కట్లేదు. ఈ సందిగ్ధం ఇలా కొనసాగుతుండగా సందులో సడేమియా అన్నట్లు అక్రమార్కులు రంగంలోకి దిగారు. కళ్లు చెదిరే నిర్మాణాలకు తెర లేపారు. ప్రభుత్వ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల (Political Leaders) జోక్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మునిసిపల్ కమిషనర్ (Municipal Commissioner) సాక్షిగా సాగిన ఈ దందా జీహెచ్ఎంసీ(GHMC)లో ఆగేనా అని స్థానికులు ప్రశిస్తున్నారు. జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నాడని నిలదీస్తున్నారు. తూంకుంట సర్కిల్‌లోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అనుమతి లేకుండా భవనం నిర్మిస్తున్నా గవర్నమెంట్ ఆఫీసర్లు (Government Officers) అంటీముట్టనట్లు ఉండిపోతున్నారు. ఒక కాంగ్రెస్ నేత అండతో పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి.. ఆ అక్రమాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదని చెబుతున్నారు. కోర్టు వివాదాల్లో (Court Case) ఉన్న స్థలంలో భారీ నిర్మాణం చేపట్టినా ప్రశ్నించేవారే కరువయ్యారు.

1925/1926 భూ రికార్డ్ ప్రకారం 1521 ఎకరాల స్థలం దేవుడి పేరు మీద ఉంది. కానీ.. 1934/1935లో రైతుల పేరు మీదికి మారింది. ఇది ఎలా జరిగిందో నిగ్గు తేలట్లేదు. ప్రభుత్వ అధికారులు రిటైర్ అయిపోతున్నారు గానీ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా తూంకుంట సర్కిల్ దేవరయంజాల్‌లోని శ్రీసీతారామచంద్రుడి భూముల సమస్య మాత్రం మిస్టరీగానే మిగిలిపోతోంది. ప్రస్తుతానికి ఈ సమస్య న్యాయస్థానం పరిధిలో ఉంది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. మనుషుల కష్టాలు తీరుస్తాడని నమ్మే దేవుడి భూములకే ఇబ్బంది వస్తే ఇక పరిష్కరించేవరెవరు?

ప్రభుత్వ ఆస్తులకు అధికారులే రక్ష. వాళ్లు తలచుకుంటే సమస్య పరిష్కారమైపోతుంది. కీలక పాత్ర పోషించాల్సినవాళ్లేమో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. ఆ భూముల్లో అక్రమ కట్టడాలు, అనుమతులు లేని పెద్ద పెద్ద గోదాంలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ఈ వ్యవహారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ దృష్టికి ఎప్పుడు వెళుతుందో అని రైతులు, స్థానికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

1925 నుంచి ఇదే కథ నడుస్తోంది. సినిమాను తలపిస్తోంది. కొన్ని కథలు వింటే అర్థమవుతాటాయి. కొన్ని కథలు కళ్లతో చూస్తే అర్థమవుతాయి. కానీ ఈ కథ మాత్రం అంతే లేకుండా కొనసాగుతోంది. దేవుడు దిగొచ్చాడా? ఆయన తన భూములను రైతుల పేరు మీదికి మార్చాడా అనే డౌటు అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. మనం దేవుడు ఉన్నాడని నమ్ముతాం. ఆపదలో ఉంటే ఆయనే దిక్కు అనుకుంటాం. ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడని విశ్వసిస్తాం. కానీ ఇప్పుడు నడుస్తున్నది కలికాలం కదా. రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోతున్న అవినీతిపరుల ఆగడాలకు ఫుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో కాలమే చెప్పాలి అనే నిర్వేదం ఆవహిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News