గోపనపల్లిలోని వేల కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా..!
22ఏ నిషేధిత జాబితాలో ఉన్నా ఆగని విల్లాలు, హై`రైజ్ భవనాల రిజిస్ట్రేషన్లు విప్రోకి ఇచ్చిన ప్రభుత్వ భూమి.. ఇప్పుడు అక్రమార్కుల పరం ఎలా..?
- రికార్డుల సాక్షిగా అక్రమార్కుల రియల్ దోపిడీ!
- సేత్వార్‌లో ప్రభుత్వ భూమి.. మోకాలో ప్రైవేట్ కబ్జా
- నకిలీ అసైనీల నుండి నకిలీ ఎనఓసీల దాకా!
- 5 నుంచి 10 ఎకరాల చొప్పున భూ స్కామ్
- ఫైళ్లు మాయం.. పట్టా భూములుగా మార్పు
- ముంచుకొస్తున్న ఏసీబీ, సిట్ తనిఖీలు!
ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన తహసిల్దార్ గారే అక్రమార్కులకు ‘రెడ్ కార్పెట’ పరుస్తున్నారా? లక్షల రూపాయల ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రభుత్వ ఆస్తులనే ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారా? అంటే గోపనపల్లి భూ కుంభకోణం ఉదంతం ‘అవును’ అనే సమాధానమిస్తోంది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి సర్వే నంబర్ 124/పి, 262/పి లలో జరుగుతున్న భూ దోపిడీపై స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా, తహసిల్దార్ చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆ “అదృశ్య హస్తం” ఎవరిది?
రికార్డుల సాక్షిగా… దోపిడీ పక్కా!
సేత్వార్ రికార్డుల ప్రకారం గోపనపల్లిలోని సర్వే నంబర్ 124లో సుమారు 278 ఎకరాలు, 262లో సుమారు 41 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిగా నమోదై ఉన్నాయి. దీనికి అతిపెద్ద నిదర్శనం ఏమిటంటే.. ఇదే సర్వే నంబర్ 124లో 46 ఎకరాలను ప్రభుత్వం గతంలో ‘విప్రో’ సంస్థకు కేటాయించింది. అంటే అది ప్రభుత్వ భూమి కాబట్టే ప్రభుత్వం కేటాయించగలిగింది. మరి అదే సర్వే నంబర్లలోని మిగిలిన వందల ఎకరాల భూమి అకస్మాత్తుగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లింది?
ఈ భూ దోపిడీ ఏదో ఆషామాషీగా జరిగింది కాదు. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన ‘సిస్టమాటిక్ ఫ్రాడ’నకిలీ అసైనీలు: అసలు అసైన్మెంటే పొందని వ్యక్తులను అసైనీలుగా సృష్టించి, ఒక్కొక్కరికి 5 నుండి 10 ఎకరాల చొప్పున కేటాయించినట్లు రికార్డులు పుట్టించారు. సాధారణంగా పేదలకు ఇచ్చే అసైన్డ్ భూమి 1`2 ఎకరాలకు మించి ఉండదు, కానీ ఇక్కడ భారీ కేటాయింపులు జరగడమే పెద్ద స్కామ్. మాయమైన ఫైల్స్: ‘అసైన్డ’ భూమిని ‘పట్టా’ భూమిగా మార్చినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు కానీ, దానికి సంబంధించిన ఎటువంటి మోటేషన్ ప్రొసీడింగ్స్ (మార్పిడి ఉత్తర్వులు) లేదా కన్వర్షన్ ఆర్డర్స్ (భూ వినియోగ మార్పిడి ఆదేశాలు) రెవెన్యూ రికార్డుల్లో లేవు.
చట్టవిరుద్ధ విక్రయాలు: ‘నిమో దత్ కోడ్ నాన్ హబెట’ అనేది ఒక ముఖ్యమైన లాటిన్ చట్ట సూత్రం. దీని అర్థం: “ఎవరి దగ్గరైతే చట్టబద్ధమైన హక్కు లేదో, వారు ఆ ఆస్తిని ఇతరులకు బదిలీ చేయలేరు.” కానీ ఇక్కడ హక్కు లేని వ్యక్తుల నుండి భారీ స్థాయిలో సేల్ డీడ్లు (విక్రయ పత్రాలు) జరిగిపోయాయి.

నిషేధిత జాబితా (22`ఎ)లో ఉన్నా..
ఆగని నిర్మాణాల జాతర!
అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, నవంబర్ 2025 నాటి అధికారిక నివేదిక (లేఖ సంఖ్య. ఈ1/4478/2024) ప్రకారం ఈ భూములు 22ఎ నిషేధిత జాబితా లో ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో విల్లాలు, హైరైజ్ బిల్డింగ్‌లు (ఆకాశహర్మ్యాలు) ఎలా వెలుస్తున్నాయి? తహసిల్దార్ కార్యాలయం భూమి స్థితిని (ల్యాండ్ స్టేటస్) ధృవీకరించకుండా నిరభ్యంతర పత్రం (ఎనఓసీ) లు ఎలా ఇచ్చింది? లేక ఆ ఎనఓసీ లు కూడా నకిలీవేనా?
తహసిల్దార్ వైఖరిపై విమర్శల జడివాన!
ఈ మొత్తం వ్యవహారంపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా, శేరిలింగంపల్లి తహసిల్దార్ స్పందన విస్మయానికి గురిచేస్తోంది. “ఉన్నతాధికారులతో మాట్లాడుతాను” అంటూ కాలయాపన చేస్తూ, పరోక్షంగా భూ అక్రమార్కులకు నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడానికి సమయం ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్ల ముందే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా తహసిల్దార్ మౌనం వహించడం వెనుక భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారులపై ప్రయోగించాల్సిన చట్టపరమైన అస్త్రాలు:
ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన బాధ్యతను విస్మరించిన అధికారులపై ఈ క్రింది పాత ఐపిసి సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు:
- ఐపీసీ సెక్షన్ 409 (నమ్మక ద్రోహం): ప్రభుత్వ సేవకుడిగా ఉండి ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
- అవినీతి నిరోధక చట్టం : తమ అధికారిక హోదాను ఉపయోగించుకుని ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చినందుకు ఏసీబీ విచారణ జరిపి ఆస్తులను జప్తు చేయవచ్చు.
- ఐపీసీ సెక్షన్లు 467, 468, 471 ( ఫోర్జరీ): నకిలీ రికార్డులు సృష్టించినా లేదా వాటిని నిజమని ధృవీకరించినా కఠిన శిక్షలు తప్పవు.
- తెలంగాణ భూ ఆక్రమణ నిరోధక చట్టం: కబ్జాదారులకు సహకరించే అధికారులను కూడా నిందితులుగా చేర్చి ప్రత్యేక కోర్టుల్లో విచారించవచ్చు.
ముంచుకొస్తున్న విచారణ సెగ!
రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా, బాధ్యతగల పౌరులు ఈ వ్యవహారాన్ని లోకాయుక్త మరియు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ కోర్టు గనుక సుమోటోగా కేసు స్వీకరిస్తే, మొదటి వేటు పడేది శేరిలింగంపల్లి తహసిల్దార్‌పైనే అని స్పష్టమవుతోంది. “ఉన్నతాధికారుల పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తే కుదరదు.. ప్రతి సంతకానికి, ప్రతి మౌనానికి జవాబు చెప్పాల్సిందే” అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. దానిని కాపాడలేని పక్షంలో తహసిల్దార్ పదవిలో కొనసాగే అర్హత కోల్పోతారు. గోపనపల్లి భూములపై సమగ్రమైన సిట్ లేదా సిబిఐ విచారణ జరిగితే తప్ప ఈ ‘అవినీతి తిమింగలాలు’ బయటపడవు. అక్రమాల వెనుక అదృశ్య శక్తులు, భారీ ఎత్తున అక్రమ లావాదేవీల వివరాలు, వసూల్ రాజాగా విధులు నిర్వర్తి స్తున్న ఆరఐ చంద్రారెడ్డి, గ్రామపాలనాధికారి ప్రవీణ్‌ల అవినీతి భాగోతంపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది
