Thursday, March 5, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంGHMC | కారుణ్య నియామకం పై కరుణించని అధికారులు..

GHMC | కారుణ్య నియామకం పై కరుణించని అధికారులు..

  • కన్నీటి సముద్రంలో కార్మిక కుటుంబాలు.. ఫైళ్ల మధ్యలో ‘కారుణ్యం’ బందీ!
  • జీహెచ్ఎంసీలో కారుణ్య నియామకాల ప్రహసనం..
  • ఇంటర్వ్యూలు పూర్తయినా కరుణించని అధికారులు
  • సంతకాల పేరుతో సాకులు.. ఆర్ధికసంక్షోభంతో బాధిత కుటుంబాల విలవిల

నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచడంలో అహర్నిశలు శ్రమించిన ఉద్యోగుల కుటుంబాలు నేడు వీధిన పడే పరిస్థితి దాపురించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీ హెచ్ఎంసీ) పరిధిలో పర్మినెంట్ ఉద్యోగులు మరణించి ఏడాది గడుస్తున్నా, వారి కుటుంబాలకు దక్కాల్సిన కారుణ్య నియామకాలు ఎండమావిగానే మిగిలిపోతున్నాయి.

పూర్తయిన ఇంటర్వ్యూలు.. అంతులేని నిరీక్షణ:

సుమారు ఏడాది క్రితం తమ ఇంటి పెద్దను కోల్పోయి శోక సముద్రంలో ఉన్న కుటుంబాలకు, జీహెచ్ఎంసీ అధికారులు కొత్త కష్టాలను రుచి చూపిస్తున్నారు. ఎట్టకేలకు గత నెల 28-11-2025న కమిటీ ముందు బాధిత కుటుంబ సభ్యులకు ఇం టర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు ముగిసి నెల రోజులు కావస్తున్నా, నేటికీ నియామక పత్రాలు అందక పోవడం గమనార్హం. దీనిపై లేబర్ వెల్ఫేర్ సెక్షన్ సిబ్బందిని ప్రశ్నిస్తే.. “కమిటీ అధికారుల సంతకాలు ఇంకా కాలేదు, ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి” అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

- Advertisement -

దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు – ఆర్థిక నరకం :

మరణించిన ఉద్యోగిపైనే ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుం బాలు, ఆ వ్యక్తి మరణంతో ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయాయి. ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పర్మినెంట్ ఉద్యోగి మరణిస్తే వెంటనే ఆదుకోవాల్సిన యంత్రాం గం, నెలల తరబడి ఫైళ్లను ఆపివేయడం ఆ కుటుంబాల పొట్ట కొట్టడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “మా బతుకులు రోడ్డున పడ్డాయి.. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అధికారులకు మా బాధలు కనిపించడం లేదు” అని ఓ మృతుని కుటుంబ సభ్యుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇది నిర్లక్ష్యమా? బాధ్యారాహిత్యమా?

జీహెచ్ఎంసీ ఉద్యోగులు తమ జీవితకాలం ప్రజల సేవకే అంకితం చేశారు. వారు మరణించినప్పుడు, వారి కుటుంబాలను ఆదుకోవడం సంస్థ కనీస బాధ్యత. కేవలం అధికారుల సంతకాల కోసం నెలల తరబడి నియామకాలను ఆపడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం జాప్యం కాదు, ఒక రకమైన మానసిక వేధింపు అని యూనియన్ నాయకులు మండిపడుతున్నారు.

అధికారులు స్పందించాలి.. న్యాయం చేయాలి

ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడాలి. సంతకాల పేరుతో సాగుతున్న ఈ కాలయాపనకు చరమగీతం పాడాలి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్లో ఉన్న ఫైళ్లపై తక్షణం సంతకాలు పూర్తి చేయాలి. ఇంటర్వ్యూలు పూర్తయిన వారందరికీ వెంటనే నియామక పత్రాలు అందజేయాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాలకు భరోసా కల్పించాలి. లేదంటే, దిక్కులేని ఆ కుటుంబాల ఉసురు తగలకముందే న్యాయం జరగాలని, కార్మిక లోకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News