- ట్రాన్సిట్ వీసా టైప్ ఏ రద్దు..
- ప్రయాణం మరింత శులభతరం..
భారతీయ ప్రయాణికులకు జర్మనీ ప్రభుత్వం శుభవార్త అందించింది. తమ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే (ట్రాన్సిట్) భారత పౌరులకు అవసరమైన ‘షెంజెన్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా (టైప్ A)’ను రద్దు చేసింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు న్యూఢిల్లీలోని జర్మన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ వంటి ప్రధాన జర్మన్ విమానాశ్రయాల నుంచి నాన్-షెంజెన్ దేశాలకు వెళ్లే లక్షలాది మంది భారతీయులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఈ ఏడాది జనవరి 12, 13 తేదీలలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ఈ మినహాయింపుపై తొలిసారిగా ప్రకటన వెలువడింది. ఆ పర్యటనలో ఇచ్చిన హామీకి అనుగుణంగా జర్మనీ ఫెడరల్ లా గెజెట్ లో జూన్ 2న అధికారిక ప్రకటన జారీ చేసి, జూన్ 3 నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు జర్మన్ ఎంబసీ తెలిపింది. “భారత్-జర్మనీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నిర్ణయం అందులో భాగమే” అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
